Topudurti Prakash Reddy: రామగిరి ఎస్సైపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సంచలన ఆరోపణలు

- లింగమయ్య హత్యకు ఆయనే కారణమన్న తోపుదుర్తి
- జగన్ పై ఎస్సై వ్యాఖ్యలకు ఖండన
- సీఎం చంద్రబాబు మెప్పుకోసమే జగన్ పై విమర్శలు చేశారని ఫైర్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై రామగిరి ఎస్సై చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఖండించారు. జగన్ పై విమర్శలు చేసే స్థాయి ఆయనకు లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసమే రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ అడ్డగోలుగా మాట్లాడారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యకు కారణం ఎస్సై సుధాకర్ యాదవ్ అని సంచలన ఆరోపణలు చేశారు.
పోలీసుల బట్టలూడదీస్తామన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతుండగా.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి మాత్రం జగన్ ను సమర్థించారు. చంద్రబాబు మెప్పు కోసం కాకుండా ప్రజల కోసం పని చేయాలని చెప్పడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. పోలీసులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కనిపించవా అని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్త హత్యకు గురైతే ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వచ్చారని, ఈ పర్యటనకు పోలీసులు ఆంక్షలు ఎందుకు పెట్టారని తోపుదుర్తి నిలదీశారు.