Manchu Manoj: మోహన్ బాబు ఇంట్లోకి మనోజ్ కు నో ఎంట్రీ... గేటు బయటే కింద కూర్చున్న మనోజ్

- మరోసారి వీధికెక్కిన మోహన్ బాబు కుటుంబ విభేదాలు
- మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లేందుకు మనోజ్ యత్నం
- అనుమతి లేదని బయటే ఆపేసిన పోలీసు అధికారులు
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న విభేదాలు కొనసాగుతున్నాయి. మోహన్ బాబు, ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు ఒక వర్గంగా... రెండో కుమారుడు మంచు మనోజ్ మరో వర్గంగా విడిపోయారు. మంచు కుటుంబ రచ్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మరోసారి మంచు కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్ జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లేందుకు మనోజ్ తన కుటుంబంతో సహా అక్కడకు వెళ్లారు. అయితే, అందరినీ దూరంలోనే పోలీసులు ఆపేశారు. మనోజ్ ను మాత్రం ఇంటి వరకు అనుమతించారు. అయితే, మనోజ్ లోపలకు వెళ్లకుండా గేటు మూసేశారు. ఇంట్లోకి వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదని పోలీసు అధికారులు తెలిపారు. దీంతో, గేటు బయటే రోడ్డుపై మనోజ్ బైఠాయించారు. మనోజ్ అక్కడకు వస్తున్నాడనే సమాచారంతో అప్పటికే అక్కడ పోలీసులు మోహరించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భద్రతను ఏర్పాటు చేశారు.
తన కూతురు పుట్టినరోజు సందర్భంగా భార్యాపిల్లలతో రాజస్థాన్ కు ఈ నెల 1న వెళ్లానని... అప్పుడు తన సోదరుడు విష్ణు 150 మందితో జల్ పల్లిలోని తన ఇంట్లోకి ప్రవేశించి వస్తువులు, సామగ్రి ధ్వంసం చేశాడని... తన కారును దొంగిలించి విష్ణు ఇంట్లో పార్క్ చేశాడని పోలీసులకు నిన్న మనోజ్ ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఈరోజు మోహన్ బాబు ఇంటికి మనోజ్ వెళ్లాడు.