Draupadi Murmu: వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది... గెజిట్ విడుదల చేసిన కేంద్రం

- పార్లమెంటులో ఇటీవలే పాసైన వక్ఫ్ సవరణ బిల్లు
- రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో చట్టంగా మారిన బిల్లు
- ఈరోజు నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు గెజిట్
వక్ఫ్ సవరణ చట్టం-2025 అమల్లోకి వచ్చింది. ఈ చట్టానికి సంబంధించిన బిల్లు ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దీనిని అమల్లోకి తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం నేడు నోటిఫికేషన్ జారీ చేసింది. పార్లమెంటు ఉభయ సభల నుంచి ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారింది.
ఈ చట్టాన్ని నేటి నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తెలియజేసింది.
మరోవైపు, ఈ వక్ఫ్ చట్టంపై కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల ఎంపీలు, ముస్లిం సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి మొత్తం 15 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణ చేపట్టనుంది.
కేంద్ర ప్రభుత్వం కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దని సుప్రీంకోర్టును కోరింది.