Pawan Kalyan: కుమారుడు గాయపడడంపై తొలిసారిగా స్పందించిన పవన్ కల్యాణ్

- సింగపూర్ లోని స్కూల్లో అగ్నిప్రమాదం
- పవన్ తనయుడు మార్క్ శంకర్ కు గాయాలు
- సింగపూర్ బయల్దేరుతున్న పవన్
- విశాఖలో మీడియాతో మాట్లాడిన వైనం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడడం తెలిసిందే. ఉదయం ఈ విషయం తెలిసినప్పుడు పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇచ్చిన మాట కోసం వచ్చానని, ఈ పర్యటన ముగిశాకే సింగపూర్ వెళతానని పవన్ ఉదయం చెప్పారు.
ఈ సాయంత్రం ఆయన పర్యటన ముగించుకుని విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కొడుకు గాయపడడంపై తొలిసారిగా స్పందించారు.
అదేదో చిన్న పాటి అగ్ని ప్రమాదం అనుకున్నానని, కానీ ఈ స్థాయిలో జరిగిందనుకోలేదని అన్నారు. "ప్రమాద తీవ్రత, అక్కడి పరిస్థితి ఎలా ఉంది? అనేది కూడా నాకు మొదట తెలియలేదు. పర్లేదులే అనుకున్నాను... కానీ తనని (కుమారుడిని) ఆసుపత్రిలో చేర్చినట్టు ఆ తర్వాత తెలిసింది. ఊపిరితిత్తుల్లోకి పొగ పోవడంతో బ్రాంకోస్కోపీ చేస్తున్నారని చెప్పారు. మా అబ్బాయి పక్కనే కూర్చున్న క్లాస్ మేట్ కు తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయట. ఓ పసిబిడ్డ ఈ ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసి చాలా బాధ కలిగింది. సమ్మర్ క్యాంప్ సందర్భంగా జరిగిన ఈ ఘటన దురదృష్టకరం" అని పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.