LSG Vs KKR: బ్యాటర్ల ఊచకోత... లక్నో భారీ స్కోర్

- ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఎల్ఎస్‌జీ, కేకేఆర్ మ్యాచ్
- లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగుల భారీ స్కోర్
- విధ్వంసం సృష్టించిన మార్ష్ (81), పూరన్ (87 నాటౌట్)
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 21వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) బ్యాటర్లు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) బౌలర్లను ఊచకోత కోశారు. దీంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన లక్నోకు ఓపెనర్లు మార్క్‌క్రమ్, మిచెల్ మార్ష్ ఏకంగా 99 పరుగుల భాగస్వామ్యం అందించడం విశేషం. వేగంగా ఆడే క్రమంలో మార్క్‌క్రమ్ 28 బంతుల్లో 47 పరుగుల చేసి, తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్... మార్ష్ విధ్వంసం సృష్టించారు. వరుస బౌండరీలతో కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. మార్ష్ 48 బంతుల్లోనే 81 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని తుపాన్ ఇన్నింగ్స్ లో 5 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. ఈ ద్వయం 5 ఓవర్లలోనే రెండో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం గమనార్హం.
చివర్లో పూరన్ ఊచకోత మరో స్థాయికి చేరింది. అతడు అజేయంగా 36 బంతుల్లో 8 సిక్సులు, 7 ఫోర్లతో 87 పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా 2 వికెట్లు తీస్తే... ఆండ్రీ రస్సెల్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఈ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.