Ashish Kumar: ఆధార్ బయోమెట్రిక్ వ్యవస్థనే ఏమార్చుతున్న హైటెక్ ముఠా గుట్టురట్టు

- ఆధార్ బయోమెట్రిక్ వివరాల తారుమారు
- 12 రాష్ట్రాల్లో నెట్ వర్క్
- నిందితులను అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు
ఆధార్ కార్డుదారుల బయోమెట్రిక్ వివరాలను తారుమారు చేస్తున్న హైటెక్ ముఠాను ఉత్తరప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా 12 రాష్ట్రాల్లోని 1,500 మందికి పైగా ఆధార్ కార్డుల బయోమెట్రిక్ డేటాను తారుమారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సంభాల్ ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్, ఏఎస్పీ అనుకృతి శర్మ ఆధ్వర్యంలో సైబర్ టీమ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించి నలుగురు కీలక నిందితులను అరెస్టు చేసింది. నిందితులు యూఐడీఏఐ వ్యవస్థలోని లొసుగులను ఉపయోగించుకుని అక్రమంగా వివరాలు మార్చేందుకు ఏజెంట్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
బదాయూన్‌కు చెందిన ఆశిష్ కుమార్, ధర్మేందర్ సింగ్, రౌనక్ పాల్, అమ్రోహాకు చెందిన కాసిం హుస్సేన్‌లను అరెస్టు చేశారు. వీరంతా 20 ఏళ్ల వయస్సు వారేనని పోలీసులు తెలిపారు. నిందితులపై ఆధార్ చట్టం, ఐటీ చట్టం 2016, పాస్‌పోర్ట్ చట్టం 1967లోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ ముఠా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో 200 నుంచి 300 మంది రిటైలర్లతో ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఏజెంట్లు ఆధార్ కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్ వంటి వివరాలను అక్రమంగా మార్చాలనుకునే వారి నుంచి పత్రాలను సేకరించి... ఒక్కొక్కరి నుంచి రూ.2,000 నుంచి రూ.5,000 వరకు వసూలు చేసేవారు.
విచారణలో ఇప్పటివరకు 1,500 ఆధార్ కార్డులను తారుమారు చేసినట్లు గుర్తించామని, పుట్టిన తేదీలు, మొబైల్ నంబర్లను మార్చినట్లు కనీసం 400 పత్రాలు లభ్యమయ్యాయని ఏఎస్పీ శర్మ తెలిపారు. ఈ ముఠా రేషన్ కార్డుల డేటాను కూడా తారుమారు చేయడానికి ప్రయత్నించిందని వెల్లడించారు. నకిలీ బయోమెట్రిక్ యాక్సెస్‌ను ఉపయోగించి పేర్లు, చిరునామాలను మార్చినట్లు గుర్తించామన్నారు.
ఈ ముఠాలోని కీలక నిందితుడు ఆశిష్ కుమార్ బీటెక్ చదువు మధ్యలో ఆపేసి ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడు. ఆశిష్ కుమార్ నకిలీ ఆధార్, పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌లను సృష్టించి వాటి ద్వారా నకిలీ పత్రాలను సృష్టించేవాడు.
నిందితులు యూఐడీఏఐ వ్యవస్థలోని లొసుగులను ఉపయోగించి ఆధార్ ఆపరేటర్ల బయోమెట్రిక్‌లను క్లోనింగ్ చేసి, అధునాతన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి జియో-ఫెన్సింగ్ నిబంధనలను అతిక్రమించేవారు. దీని ద్వారా సులభంగా లాగిన్ అయి బయోమెట్రిక్ డేటాను అప్‌లోడ్ చేసేవారు. కాసిం హుస్సేన్ అనే నిందితుడు వేలిముద్ర స్కానర్‌లను ఏమార్చి సిలికాన్ వేలిముద్రలను ఉపయోగించేవాడు. నిజమైన ఆపరేటర్ల నుంచి, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వ్యక్తుల నుంచి వేలిముద్రలు సేకరించి వాటితో నకిలీ వేలిముద్రలు తయారు చేసేవారు.
డిసెంబర్ 2024 తర్వాత ధృవీకరణ నిబంధనలు కఠినతరం కావడంతో ఈ ముఠా నకిలీ జనన ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డులను ఉపయోగించి 20కి పైగా నకిలీ పాస్‌పోర్ట్‌లను సృష్టించినట్టు పోలీసులు గుర్తించారు.