Sunil Gavaskar: టీమిండియా క్రికెటర్లకు గవాస్కర్ ఆసక్తికర సూచన

- పటౌడీ ట్రోఫీ రిటైర్మెంట్ వార్తలపై సునీల్ గవాస్కర్ అసంతృప్తి
- ట్రోఫీ రిటైర్మెంట్ ఇవ్వడం గురించి మొదటిసారి వింటున్నానన్న గవాస్కర్
- ఈసీబీ ఆఫర్ ఇస్తే తిరస్కరించాలని క్రికెట్ దిగ్గజాలకు గవాస్కర్ సూచన
పటౌడీ ట్రోఫీ విషయంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్వదేశంలో భారత జట్టుతో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో విజేతలకు బహుకరించే పటౌడీ ట్రోఫీని నిలిపివేయాలని ఈసీబీ యోచిస్తోంది. అయితే ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డులు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం తెలియరాలేదు. ఇరు దేశాలకు చెందిన దిగ్గజ ఆటగాళ్ల పేరుతో మరో ట్రోఫీని ఖరారు చేయాలని ఈసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్, జులైలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లో కొత్త పేరుతో ట్రోఫీని అందించే అవకాశం ఉందని సమాచారం.
ఈ వార్తలపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించారు. పటౌడీ ట్రోఫీని రద్దు చేయాలనే ఈసీబీ ఆలోచనను ఆయన వ్యతిరేకించారు. ఈ సందర్భంగా భారత దిగ్గజ ఆటగాళ్లందరికీ ఆయన ఒక సూచన చేశారు. ఏదైనా ట్రోఫీకి వ్యక్తుల పేర్లు పెట్టిన తర్వాత దానిని రద్దు చేయడం గురించి వినడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. ఇది ఈసీబీ తీసుకున్న నిర్ణయమైనప్పటికీ, బీసీసీఐకి దీని గురించి సమాచారం ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్, ఇంగ్లాండ్ క్రికెట్‌కు పటౌడీలు చేసిన సేవలను ఈ నిర్ణయం విస్మరిస్తుందని ఆయన అన్నారు.
ఇటీవల రిటైర్ అయిన దిగ్గజ ఆటగాళ్ల పేర్లతో కొత్త ట్రోఫీ ఉండవచ్చని, ఒకవేళ ఈసీబీ ఎవరినైనా సంప్రదిస్తే వారు సున్నితంగా తిరస్కరించాలని ఆయన కోరారు. ఇలా చేయడం వల్ల పటౌడీలను గౌరవించినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, భవిష్యత్తులో తనకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా జాగ్రత్తపడవచ్చని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
భారత మాజీ క్రికెటర్ మన్సూర్ ఆలీఖాన్ పటౌడీ గౌరవార్థం ఇంగ్లండ్ బోర్డు 2007లో పటౌడీ ట్రోఫీని ప్రారంభించింది. అప్పటి నుంచి తమ దేశంలో టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు విజేతగా నిలిచిన జట్టుకు ఈ ట్రోఫీని అందజేస్తోంది.