Bennylingam: పాస్టర్ మృతిపై మాట మార్చిన వైసీపీ నేత బెన్నిలింగం

- రాజమహేంద్రవరం ఆసుపత్రి వద్ద బెన్నిలింగం రెచ్చగొట్టే వ్యాఖ్యలు
- పాస్టర్ ప్రవీణ్‌ది కచ్చితంగా హత్యేనన్న వైసీపీ నేత
- ఆ రోజు ఆవేశంలో మాట్లాడానని ఒప్పుకోలు
- పాస్టర్‌ది హత్యేనని చెప్పేందుకు తన వద్ద ఆధారాలు లేవని స్పష్టీకరణ
పాస్టర్ పగడాల ప్రవీణ్‌ది హత్యేనని, అందులో ఎలాంటి అనుమానం లేదన్న వైసీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెన్నిలింగం పోలీసు విచారణలో మాట మార్చారు. ఆ రోజు ఏదో ఆవేశంలో మాట్లాడానని, మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం ఆసుపత్రి వద్ద ఇటీవల బెన్నిలింగం మాట్లాడుతూ.. ‘‘పాస్టర్ ప్రవీణ్‌ది కచ్చితంగా హత్యే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే ఊచకోత కోస్తాం. మమ్మల్ని కెలకొద్దు, మేం మంచివాళ్లం కాదు.. మూర్ఖులం. మాతో పెట్టుకోవద్దు’ అని వ్యాఖ్యానించారు. దీంతో ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి విచారణకు పిలిచారు.
నిన్న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరైన బెన్నిలింగం.. ఆ రోజు ఆవేశంలో మాట్లాడానని, మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశం తనకు లేదని, పాస్టర్‌ను హత్య చేశారని చెప్పేందుకు తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని దర్యాప్తు అధికారులకు తెలిపారు. తన వీడియోను ఎడిట్ చేసి, మార్ఫింగ్ చేశారని ఆయన ఆరోపించినట్టు తెలిసింది. సాయంత్రం వరకు విచారించిన పోలీసులు అనంతరం ఆయన నుంచి వాంగ్మూలం తీసుకుని విడిచిపెట్టారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా పోలీసులు ఆయనకు తెలిపారు.