RCB: ఉత్కంఠ పోరులో ఆర్సీబీదే విజయం.. ముంబై నాలుగో ఓటమి

- ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో ఓడిన ముంబై ఇండియన్స్
- ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాండ్యా సేన
- మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో బెంగళూరు
సొంత స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు పరాజయం పాలైంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో విజయం సాధించి మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకోగా, ముంబై ఇండియన్స్ ఐదు మ్యాచుల్లో 4 ఓటములతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఆర్సీబీ నిర్దేశించిన 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. గతంలో 219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముంబై ఈసారి మాత్రం 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. రోహిత్ శర్మ (17) మరోమారు నిరాశ పరిచాడు. మెరుపులు మెరిపిస్తాడనుకున్న సూర్యకుమార్ యాదవ్ (28) కూడా అభిమానుల ఆశలను అందుకోలేకపోయాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడినప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విల్ జాక్స్ 22 పరుగులు చేశాడు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ముంబై ఇండియన్స్ విజయానికి 13 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా 4 వికెట్లు తీసుకోగా, యశ్ దయాళ్, హేజెల్‌వుడ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. తొలి ఓవర్ రెండో బంతికే ఫిల్ సాల్ట్ (4) వికెట్‌ను కోల్పోయినప్పటికీ కోహ్లీ, పడిక్కల్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇద్దరూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు పిండుకున్నారు. ఈ క్రమంలో 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసిన పడిక్కల్ అవుటైన తర్వాత వచ్చిన కెప్టెన్ రజత్ పటీదార్ కోహ్లీకి అండగా నిలిచాడు. ఇద్దరూ కలిసి బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేసిన కోహ్లీ 143 పరుగుల వద్ద ఔటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన లివింగ్‌స్టోన్ (0) ఆ తర్వాత ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన జితేశ్ శర్మ బ్యాట్ ఝళిపించాడు 19 బంతుల్లో రెండు ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. పటీదార్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేసి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్‌తో జట్టులోకి వచ్చిన స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 4 ఓవర్లు వేసి 29 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రజత్ పటీదార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో నేడు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.