పోలీసుల నోటీసులు... తీవ్రంగా స్పందించిన మన్నె క్రిశాంక్

  • మన్నె క్రిశాంక్‌కు నోటీసులు జారీ చేసిన గచ్చిబౌలి పోలీసులు
  • ఈ నెల 9, 10, 11 తేదీల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశం
  • న్యాయపరంగా ఎదుర్కొంటానన్న మన్నె క్రిశాంక్
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేశారంటూ ఆయనకు నోటీసులు అందజేశారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

హెచ్‌సీయూ భూములపై ఏఐ వీడియోలు, ఫొటోలు పెట్టారంటూ కొణతం దిలీప్, మన్నె క్రిశాంక్, థామస్ అగస్టీన్‌లపై ఇదివరకే గచ్చిబౌలి పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు.

ఏఐ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు ఉందా?: మన్నె క్రిశాంక్

పోలీసులు తనకు నోటీసులు జారీ చేయడంపై మన్నె క్రిశాంక్ స్పందించారు. కాంగ్రెస్ డ్యామేజ్ కంట్రోల్‌ను ప్రారంభించిందని ఆయన అన్నారు. తాను చేసిన పోస్టుల్లో ఎక్కడ ఏఐని వాడలేదని స్పష్టం చేశారు. ఇటీవల హెచ్‌సీయూ విడుదల చేసిన ఫొటోలు, వీడియోలు అన్నీ వాస్తవమేనని తెలిపారు. దీనిని తాను న్యాయపరంగా ఎదుర్కొంటానని అన్నారు. జింకలు రోడ్ల మీదకు ఎందుకు వచ్చాయి, ఇళ్లలోకి ఎందుకు వెళ్లాయో తెలిపే వీడియోలు అన్నీ తన వద్ద ఉన్నాయని చెప్పారు.

కంచ గచ్చిబౌలి భూముల్లోకి ఎవరూ రాకూడదని ఆంక్షలు విధించారని, ఇప్పుడు ఏఐతో వీడియోలు సృష్టించారని అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. అసలు ఏఐ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి ఉందా అని నిలదీశారు. అక్కడ జింకలు, నెమళ్లు ఉన్నాయని జాతీయస్థాయిలో నిరూపితమైందని అన్నారు.

అయినప్పటికీ తనపై నాలుగు కేసులు నమోదు చేశారని విమర్శించారు. జింకలు చనిపోవడానికి, చెట్లను నరకడానికి కారణమెవరో తెలియాలని డిమాండ్ చేశారు. కంచ గచ్చిబౌలిలో జింకలు లేవని ఒక్కొక్కరికి రూ. 20 వేలు ఇచ్చి వీడియోలు పెట్టిస్తున్నారని ఆరోపించారు.


More Telugu News