Acchannaidu: ఆక్వా రంగంపై అమెరికా సుంకాల ప్రభావం తాత్కాలికమే: మంత్రి అచ్చెన్నాయుడు

- వివిధ దేశాలపై సుంకాలు పెంచిన ట్రంప్
- ఏపీలోని ఆక్వారంగంపైనా ప్రభావం
- ఆక్వా సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడు సమావేశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఏపీలోని ఆక్వారంగంపై కూడా పడింది. దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. ఆక్వా రంగంపై అమెరికా టారిఫ్ ల ప్రభావం తాత్కాలికమేనని అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆక్వా సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన నేడు కీలక సమావేశం జరిగింది. ఆక్వా రంగ నిపుణులు, వ్యాపారులు, అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. అమెరికా సుంకాలు, ఆక్వా రంగానికి ఇబ్బందులపై చర్చించారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఆక్వా రంగాన్ని తిరిగి గాడిన పెట్టేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ ఆక్వా ఉత్పత్తులను సద్వినియోగం చేసుకుందాం అని సాగుదారులకు పిలుపునిచ్చారు. రైతులు, సీడ్స్ ఉత్పత్తిదారులు, నిపుణులు, ఫీడ్ తయారీదారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.