Anantalakshmi: పోలీస్ స్టేషన్‌లోనే నిందితుడిపై రుబాబు .. టీడీపీ మహిళా నేతపై కేసు నమోదు

- విశాఖ పార్లమెంటరీ టీడీపీ మహిళా నేత అనంతలక్ష్మిపై కేసు నమోదు
- పోలీస్ స్టేషన్ లోనే నిందితుడిపై చేయి చేసుకున్న వైనం
- పోలీస్ స్టేషన్‌లో సీసీ టీవీ పుటేజీ ఆధారంగా కేసు నమోదు
విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మిపై నిన్న పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం. అక్కిరెడ్డిపాలేనికి చెందిన కొత్తూరు నరేంద్ర హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నరేంద్ర తమ నుంచి రూ. 40 లక్షలు తీసుకుని మోసం చేశాడని అనంతలక్ష్మి గత నెల 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు నరేంద్రను పిలిచి విచారిస్తుండగా, విషయం తెలుసుకున్న అనంతలక్ష్మి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన కాలి చెప్పుతో నరేంద్ర చెంపలు వాయించారు. విచారణ అనంతరం నిందితుడు నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిలుపై విడుదలయ్యాడు. అనంతరం ఆయన నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీని కలిసి అనంతలక్ష్మి తనను పోలీస్ స్టేషన్‌లోనే చెప్పుతో కొట్టినట్టు ఫిర్యాదు చేశాడు.
సీపీ దీనిని తీవ్రంగా పరిగణించారు. ఆయన ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి దాని ఆధారంగా నిన్న అనంతలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై చేయి చేసుకోవడం తప్పని సీఐ పార్థసారథి వారిస్తున్నా అనంతలక్ష్మి వినలేదు సరికదా, ‘నా గురించి నీకు తెలియదు. నిన్న ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ చేయిస్తా’ అని సీఐని ఆమె బెదిరించినట్టు స్టేషన్ వర్గాలు తెలిపాయి. సీఐ కూడా బెదిరింపు వాస్తవమేనని తెలిపారు.