Donald Trump: ట్రంప్ విధానాలపై విదేశీ నగరాల్లోనూ నిరసనలు

- ప్రభుత్వ కోతలను, వాణిజ్య సుంకాలను వ్యతిరేకిస్తున్న అమెరికన్లు
- ట్రంప్ విధానాలను ఖండిస్తూ యూరప్ నగరాల్లోనూ ర్యాలీలు
- దిగజారుతున్న ట్రంప్ ఆమోద రేటింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ లండన్, బెర్లిన్ వంటి యూరోపియన్ నగరాల్లో కూడా నిరసనలు జరిగాయి. ట్రంప్ ఒక రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించారని, ఆయన ఒక పిచ్చివాడని బెర్లిన్‌కు చెందిన ఒక ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తి విమర్శించారు.
ప్రభుత్వాన్ని కుదించడం, ఏకపక్షంగా సంప్రదాయవాద విలువలను అమలు చేయడం, స్నేహపూర్వక దేశాలపై వాణిజ్యపరంగా ఒత్తిడి తేవడం వంటి చర్యలతో ట్రంప్ చాలా మంది అమెరికన్ల ఆగ్రహానికి గురయ్యారని... స్టాక్ మార్కెట్లు పతనమయ్యేలా చేశారని నిరసనకారులు మండిపడ్డారు.
ఇటు, వేలాది మంది అమెరికన్లు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోత, వాణిజ్య సుంకాలు, పౌర హక్కుల తగ్గింపు వంటి ట్రంప్ విధానాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాషింగ్టన్, న్యూయార్క్, హ్యూస్టన్, ఫ్లోరిడా, కొలరాడో, లాస్ ఏంజెలెస్ మరియు ఇతర నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. న్యూయార్క్ నగరంలో ఒక మహిళ మాట్లాడుతూ "మా దేశాన్ని కొందరు శక్తివంతులైన, తెల్ల జాతీయులు మరియు నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు శాసిస్తున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు.
వాషింగ్టన్ నగరంలో వేలాది మంది నిరసనకారులు నేషనల్ మాల్ వద్ద గుమిగూడారు. ప్రపంచవ్యాప్తంగా మిత్రదేశాలను కోల్పోయేలా చేస్తున్న ఈ ప్రభుత్వం దేశానికి నష్టం కలిగిస్తోందని నిరసనకారులు ఆరోపించారు. లాస్ ఏంజెలెస్‌లో ఒక మహిళ 'గెట్ అవుట్ ఆఫ్ మై యుటెరస్' అనే సందేశంతో ట్రంప్ యొక్క గర్భస్రావ వ్యతిరేక విధానాలను నిరసించారు. డెన్వర్ నగరంలో ఒక నిరసనకారుడు 'నో కింగ్ ఫర్ యూఎస్ఏ' అనే ప్లకార్డును ప్రదర్శించారు.