Donald Trump: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్... ఆ ముగ్గురికి దిమ్మదిరిగింది!

- వివిధ దేశాలపై భారీగా ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్
- కుప్పకూలిన ప్రపంచ మార్కెట్లు
- జుకర్ బర్గ్, బెజోస్, మస్క్ లకు తీవ్ర నష్టాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పన్నుల విధానాన్ని ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. అపర కుబేరులు మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ ఒక్కరోజులోనే భారీగా నష్టపోయారు.
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సంపద ఒక్కరోజులో 17.9 బిలియన్ డాలర్లు (రూ.1.5 లక్షల కోట్లు) తగ్గింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 16 బిలియన్ డాలర్లు (రూ.1.3 లక్షల కోట్లు), టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 8.7 బిలియన్ డాలర్ల (రూ.74 వేల కోట్లు) నష్టాన్ని చవిచూశారు.
ట్రంప్ ప్రభుత్వం వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు విధించడంతో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే మొదట అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఇదే అతిపెద్ద ఆర్థిక పతనం అని నిపుణులు చెబుతున్నారు. పన్నుల ప్రభావం వల్ల వ్యాపార వ్యయాలు పెరగడం, ప్రపంచ వాణిజ్యం మందగించడం, సాంకేతిక రంగం పనితీరు దిగజారడం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు.
ఇతర సంస్థల వ్యవస్థాపకులు, సీఈఓల నష్టాలు
* ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ 7.4 బిలియన్ డాలర్లు (రూ.63 వేల కోట్లు) నష్టపోయారు.
* మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 774 మిలియన్ డాలర్లు (రూ.6,363 కోట్లు) నష్టపోయారు.
* ఆల్ఫాబెట్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ వరుసగా 4.9 బిలియన్ డాలర్లు (రూ.41 వేల కోట్లు), 4.6 బిలియన్ డాలర్లు (రూ.39 వేల కోట్లు) నష్టపోయారు.
* ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ 18 మిలియన్ డాలర్లు (రూ.153 కోట్లు) నష్టపోయారు.
* ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ 68 మిలియన్ డాలర్ల (రూ.581 కోట్లు) నష్టాన్ని చవిచూశారు.
అమెరికా మార్కెట్ల పతనం
ట్రంప్ ప్రకటనతో అమెరికా మార్కెట్లు 2022 నాటి కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఎఓస్ అండ్ పి 500 సూచిక 275.05 పాయింట్లు తగ్గి 5,395.92 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ 1,053.60 పాయింట్లు తగ్గి 16,547.45 వద్ద ముగిసింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1,682.61 పాయింట్లు తగ్గి 40,542.71 వద్ద ముగిసింది.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని UBS విశ్లేషకులు తెలిపారు. వ్యాపార సంస్థలు లాబీయింగ్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తాయని, ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని UBS పేర్కొంది. చర్చల ద్వారా పన్నులను తగ్గించే అవకాశం ఉందని, ఆర్థిక మంత్రి బెస్సెంట్ కూడా ఇదే విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ ఇంటర్వ్యూలో చెప్పారని తెలిపింది.
కాగా, అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంత విస్తృతమైన ఆర్థిక విధాన మార్పులకు ఈ చట్టాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి.