Kushdil Shah: ప్రేక్షకులపై దాడికి ప్రయత్నించిన పాకిస్థాన్ క్రికెటర్

- కివీస్‌తో వన్డే సిరీస్‌లో పాక్ ఓటమి
- ఆటగాళ్లను హేళన చేసిన ప్రేక్షకులు
- పాక్ క్రికెటర్ ఖుష్‌దిల్ షా ఆగ్రహం... ఓ అభిమానిపైకి దూసుకెళ్లిన వైనం
- ప్రేక్షకుల ప్రవర్తనను ఖండించిన పీసీబీ
కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పాకిస్థాన్ క్లీన్ స్వీప్ ఓటమి ఎదుర్కోవడంతో అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో, స్టేడియంలో ఆటగాళ్లు, అభిమానుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పాక్ క్రికెటర్ ఖుష్‌దిల్ షా ఏకంగా అభిమానులపై దాడికి యత్నించాడు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పందించింది.
బే ఓవెల్ మైదానంలో జరిగిన చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది. దీంతో ఆగ్రహించిన కొందరు అభిమానులు ఆటగాళ్లను దూషించారు. డగౌట్‌లో ఉన్న ఖుష్‌దిల్ షాను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరంగా మాట్లాడారు. వారిని వారించే ప్రయత్నం చేసినా వినకపోవడంతో ఖుష్‌దిల్ షా సహనం కోల్పోయి ఒక అభిమానిపైకి వెళ్ళాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఈ సంఘటనపై పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. పాక్ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని దూషించింది విదేశీ ప్రేక్షకులు అని వెల్లడించింది. వారి ప్రవర్తనను ఖండిస్తున్నామని పేర్కొంది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసినప్పుడు ఖుష్‌దిల్ షా వారిని వారించడానికి ప్రయత్నించాడని, దీనికి ప్రతిస్పందనగా వారు మరింత అనుచితంగా ప్రవర్తించారని తెలిపింది. స్టేడియం అధికారులు జోక్యం చేసుకుని దురుసుగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులను బయటకు పంపించారని పీసీబీ పేర్కొంది. కాగా, ఆ ప్రేక్షకుల్లో కొందరు ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన వారు ఉన్నట్లు సమాచారం.