Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి త్వరలో టెండర్లు

Amaravati Railway Line Tender Announcement Soon

  • తొలుత ఎర్రుపాలెం-నంబూరు రైల్వే లైన్ నిర్మాణం
  • 27 కిలోమీటర్ల ట్రాక్‌తోపాటు కృష్ణా నదిపై వంతెన నిర్మాణం
  • మరో రెండు నెలల్లో టెండర్లు
  • మూడేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రైల్వే

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా వెళ్లే ఎర్రుపాలెం-నంబూరు రైల్వే లైన్ నిర్మాణం కోసం త్వరలో టెండర్లు పిలవనున్నారు. భూసేకరణ కొంతమేర కొలిక్కి వచ్చింది. ఈ నేపథ్యంలో రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వేశాఖ సమాయత్తమవుతోంది. తొలుత 27 కిలోమీటర్ల ట్రాక్‌తోపాటు కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి మరో రెండు నెలల్లో టెండర్లు పిలవనున్నట్టు తెలుస్తోంది. కాజీపేట-విజయవాడ లైన్‌లోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి మొదలయ్యే ఈ రైల్వే లైన్ అమరావతి మీదుగా గుంటూరు జిల్లా నంబూరు వద్ద విజయవాడ-గుంటూరు లైన్‌లో కలుస్తుంది. ఈ రైల్వే లైన్ మొత్తం పొడవు 57 కిలోమీటర్లు.

27 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 450 కోట్లు, కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల వంతెన నిర్మాణానికి రూ.350 కోట్లు ఖర్చవుతాయని ప్రాథమిక అంచనా. వచ్చే మూడేళ్లలో ఈ పనులు పూర్తిచేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, రెండేళ్లలోనే పూర్తిచేయాలని రైల్వేశాఖను చంద్రబాబు కోరారు. ట్రాక్ నిర్మాణం రెండేళ్లలో పూర్తవుతుందని, కానీ, వంతెన నిర్మాణానికి మూడేళ్లు పడుతుందని రైల్వేశాఖ చెబుతోంది. అలాగే, అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణానికి కూడా టెండర్లు పిలుస్తారు. సీఆర్‌డీఏ పరిధిలోని తాడికొండ ప్రాంతంలో రైల్వే లైన్‌కు భూములిచ్చేందుకు రైతులు అభ్యంతరం చెబుతుండటంతో అమరావతి నుంచి నంబూరు వరకు 26.5 కిలోమీటర్ల రైల్వే లైన్ పనులు మాత్రం కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

Amaravati Railway Line
Railway Line Construction
Tender Announcement
Andhra Pradesh
Errupalem-Namburu
Krishna River Bridge
Chandrababu Naidu
Railway Station Construction
Land Acquisition
57km Railway Line
  • Loading...

More Telugu News