Kishan Reddy: కిషన్ రెడ్డిపై రాజాసింగ్ విమర్శలు.. స్పందించిన బండి సంజయ్

- బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అన్న బండి సంజయ్
- రాజాసింగ్ అంకితభావం, కష్టపడే తత్వం కలిగిన నాయకుడన్న బండి సంజయ్
- అంతర్గత విషయాలపై మీడియా ముందుకు రావొద్దని సూచన
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం వ్యవహారానికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, వ్యక్తిగత ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. తన సిఫార్సులను కూడా పార్టీ కేంద్ర నాయకత్వం ఎల్లప్పుడూ ఆమోదించలేదని ఆయన తెలిపారు.
అదే సమయంలో ఆయన రాజాసింగ్‌పై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీకి రాజాసింగ్ అంకితభావంతో, కష్టపడి పనిచేసే నాయకుడని అన్నారు. అయితే పార్టీ అంతర్గత విషయాలపై మీడియా ముందుకు రావొద్దని, పార్టీలోనే చర్చించుకోవాలని సూచించారు. పార్టీలోని చిన్న చిన్న అంతరాలను బయటకు తీసుకువచ్చి పెద్దగా చేయకూడదని అన్నారు. అలాంటి చర్యలు పార్టీకి నష్టం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.