Harish Rao: జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి షాక్... బీఆర్ఎస్‌లో చేరిన నాయకులు

- హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన పలువురు నాయకులు
- బీఆర్ఎస్‌లో చేరిన వారిలో మాజీ సీడీసీ చైర్మన్, మాజీ సహకార సంఘం అధ్యక్షుడు
- తెలంగాణను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శ
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. మాజీ మంత్రి, సీనియర్ శాసనసభ్యుడు హరీశ్ రావు సమక్షంలో వారు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారిలో సీడీసీ మాజీ ఛైర్మన్ ఉమాకాంత్ పటేల్, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు బస్వరాజు, మాజీ ఎంపీటీసీలు విజయేందర్ రెడ్డి, సంతోష్ పాటిల్, సీనియర్ నాయకులు సుభాష్ రావు, భూమయ్య, లక్ష్మయ్యతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు గెలిచినప్పటికీ, బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రారంభించిన బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. ఎస్డీఎఫ్ నిధులను విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటోందని పేర్కొన్నారు.