John Abraham: కంచ గచ్చిబౌలి భూముల వివాదం... సీఎం రేవంత్ రెడ్డికి బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం రిక్వెస్ట్

- కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై 'ఎక్స్' వేదికగా స్పందించిన జాన్ అబ్రహం
- 400 ఎకరాల్లో అడవులను నరికివేసే ప్రణాళికను రద్దు చేయాలని సీఎంకు రిక్వెస్ట్
- ఎన్నో వణ్యప్రాణులు ఉన్నాయని, వేలాది చెట్లను కొట్టి వాటికి గూడు లేకుండా చేయొద్దన్న నటుడు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సమీపంలోని కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిలో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆ డెవలప్‌మెంట్ ప్లాన్‌ను నిలిపివేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
హైదరాబాద్‌కు ఆక్సిజన్ అందిస్తున్న 400 ఎకరాల అడవిలో ఎన్నో వణ్యప్రాణులు ఉన్నాయని, వేలాది చెట్లను కొట్టి వాటికి గూడు లేకుండా చేయొద్దని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా జాన్ అబ్రహం అభ్యర్ధించారు.
"గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నగరానికి ఆక్సిజన్ ఆకుపచ్చని అటవీ, దశాబ్దాలుగా అనేక రకాల రక్షిత వన్యప్రాణులకు నివాసంగా పనిచేస్తున్న కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల చెట్లు/అడవులను నరికివేసే ప్రణాళికను రద్దు చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. చెట్లను నరికివేయడం వల్ల వన్యప్రాణులకు ఇల్లు లేకుండా పోతుంది. మనిషి-వన్యప్రాణుల సంఘర్షణ తీవ్రమవుతుంది. దయచేసి దీన్ని ఆపండి" అని నటుడు ఎక్స్‌లో చేతులు జోడించి ఎమోజితో పోస్ట్ చేశారు.
ఇక ఇప్పటికే ఈ వివాదంపై పలువురు టాలీవుడ్ నటీనటులు కూడా స్పందించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తుది ఆదేశాలు జారీ చేసే వరకు ఈ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఒక్క రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం ఏమిటని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.