Ankhani Satyaprasad: ఏపీలో ఇక పది నిమిషాల్లో భూముల రిజిస్ట్రేషన్: మంత్రి అనగాని

- స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్
- గంటల కొద్ది వేచి ఉండాల్సిన అవసరం లేదని వెల్లడి
- ప్రస్తుతం 26 జిల్లా కేంద్రాల రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ సేవలను శుక్రవారం అమరావతి సచివాలయంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు సులభతరంగా సేవలు అందించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు.
రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు ఆ సమయానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని సత్యప్రసాద్ పేర్కొన్నారు. దీని ద్వారా ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదన్నారు. శుక్రవారం మొత్తం 26 జిల్లాల ప్రధాన కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని, మొత్తం 296 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ స్లాట్ బుకింగ్ సిస్టమ్ దశల వారీగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
ఇప్పటికే గాంధీనగర్, కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేశామని, ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని మంత్రి తెలిపారు. ఈ విధానంలో కేవలం 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని చెప్పారు. స్లాట్ బుకింగ్ చేసుకోలేకపోయిన వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వస్తే సాయంత్రం ఐదు గంటల తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారని తెలిపారు.
తొలుత రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్.పి. సిసోడియా, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఐజీ హరి నారాయణ, అడిషనల్ ఐజీ ఉదయ భాస్కర్, జాయింట్ ఐజీలు రవికుమార్, సరోజలతో కలిసి మంత్రి స్లాట్ బుకింగ్ అవగాహన కరపత్రాన్ని, పోస్టర్‌ను ఆవిష్కరించారు.