Mohammad Kaif: కెప్టెన్ కమిన్స్ ఒత్తిడితో ఉన్నాడు.. సన్‌రైజర్స్ పుంజుకోవడం అంత ఈజీ కాదు: మహ్మద్ కైఫ్

- ఈసారి ఐపీఎల్ సన్‌రైజర్స్‌కు ఎదురుగాలి
- హ్యాట్రిక్ ఓటమితో డీలాపడ్డ టీమ్
- ఈ నేపథ్యంలో ఎస్ఆర్‌హెచ్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
ఈసారి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) అంచనాలను అందుకోలేక చతికిలపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ 4 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. వరుసగా మూడు ఓటములు నమోదు చేసి పూర్తిగా డీలాపడిపోయింది.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నీ విభాగాలలో ఆ జట్టు నిరాశపరుస్తోంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నిర్ణయాలు కూడా బెడిసికొడుతున్నాయి. గురువారం నాడు కేకేఆర్‌తో ఏకంగా 80 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇదే ఆ జట్టుకు పరుగుల పరంగా భారీ ఓటమి.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సన్‌రైజర్స్ ఆటతీరుపై విమర్శలు గుప్పించాడు. ఆ జట్టు తిరిగి పుంజుకోవడం అంత ఈజీ కాదని తెలిపాడు. ఏ ఒక్క విభాగంలోనూ ఎస్ఆర్‌హెచ్ మెరుగైన ప్రదర్శన చేయలేకపోతుందన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో పూర్తిగా తేలిపోతుందని, కెప్టెన్ కమిన్స్ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నాడని కైఫ్ చెప్పాడు.
"ఆ జట్టు బ్యాటింగ్ క్లిక్ అవడం లేదు. బౌలింగ్ చాలా పేలవంగా ఉంది. కెప్టెన్సీ మరీ దారుణంగా కనిపిస్తోంది. స్పిన్నర్లు నిన్న అద్భుతంగా బౌలింగ్ చేసినా వారికి మళ్లీ బౌలింగ్ ఇవ్వలేదు. ఆ జట్టుపై ఉన్న అంచనాల ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ బలహీనతను బౌలర్లు కనిపెట్టేశారు. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన ఎస్ఆర్‌హెచ్ ఇక పుంజుకోవడం అంత ఈజీ కాదు" అని కైఫ్ చెప్పుకొచ్చాడు.