పది నెలల్లోనే ఇళ్ల పట్టాల హామీని నిలబెట్టుకున్నా: నారా లోకేశ్

  • నన్ను గెలిపించిన మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుంటానన్న మంత్రి
  • నియోజకవర్గ ప్రజల కోసం 26 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడి
  • ఏప్రిల్ 13న వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన
  • సరిగ్గా ఏడాది తర్వాత ప్రారంభోత్సవం చేస్తామని హామీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజా ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే నిలబెట్టుకున్నట్లు మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం మంగళగిరిలో నిర్వహించిన ‘మన ఇల్లు- మన లోకేశ్’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసిన అనంతరం స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని లోకేశ్ చెప్పారు. నియోజకవర్గంలో 26 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. 

మంగళగిరి ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు లోకేశ్ చెప్పారు. సూపర్‌ సిక్స్‌ హామీలతో పాటు మంగళగిరి ప్రజలకు తాను ప్రత్యేకంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 13న వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి, వచ్చే ఏడాది సరిగ్గా అదే తేదీన ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ‘ఎన్టీఆర్‌ సంజీవని’ పేరుతో మంగళగిరి, తాడేపల్లిలో క్లినిక్‌లు ఏర్పాటు చేసిన విషయం గుర్తుచేశారు. దుగ్గిరాలలో మొబైల్‌ క్లినిక్‌ పెట్టి ఉచిత చికిత్సతో పాటు మందులు అందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో నీటి సమస్య ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని వివరించారు. నిరుపేదలకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టుమిషన్లు అందజేసినట్లు మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.


More Telugu News