Manoj Kumar: బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ కుమార్ కన్నుమూత

- ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- నటుడిగా, దర్శకుడిగా, పాటల రచయితగా, ఎడిటర్‌గా మనోజ్ కుమార్‌లో విభిన్న కోణాలు
- దేశభక్తి సినిమాల్లో ఎక్కువగా నటించడంతో ‘భారత్ కుమార్’ అని పేరు
- 1992లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిన భారత ప్రభుత్వం
బాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు మనోజ్‌కుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి గల కారణం తెలియరాలేదు. మనోజ్ కుమార్ పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. ‘పూరబ్ ఔర్ పాచిమ్’, ‘క్రాంతి’, ‘రోటీ, కపడా ఔర్ మకాన్’ వంటి సినిమాలు ఆయనకు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి.
దేశభక్తి చిత్రాల్లో ఎక్కువగా నటించడంతో ఆయనను ‘భారత్ కుమార్’ అని పిలుచుకునేవారు. ఒక జాతీయ చలనచిత్ర అవార్డు, ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, స్క్రీన్ రైటర్‌గా, పాటల రచయితగా, ఎడిటర్‌గా భిన్న పార్శ్వాలు కలిగిన వ్యక్తిగా మనోజ్ కుమార్ పేరు సంపాదించుకున్నారు. 1992లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అలాగే, 2015లో ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డును అందుకున్నారు.