Sunrisers Hyderabad: సన్ రైజర్స్ మళ్లీ కుదేల్... హైదరాబాద్ జట్టుకు హ్యాట్రిక్ ఓటమి

- కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్
- 80 పరుగుల తేడాతో ఓడిన సన్ రైజర్స్
- 201 పరుగుల లక్ష్యఛేదనలో 120కే ఆలౌట్
గత ఐపీఎల్ సీజన్ లో పరుగుల సునామీ సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లో తడబడుతోంది. తొలి మ్యాచ్ లో రికార్డు స్కోరు చేసి గత సీజన్ ఆటతీరును కంటిన్యూ చేస్తున్నట్టే కనిపించినా, ఆ తర్వాత వరుసగా రెండు ఓటములతో నిరాశపరిచింది. ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలోనూ ఓటమిపాలై వరుసగా మూడో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది.
కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ జట్టు 80 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేయగా... 201 పరుగుల లక్ష్యఛేదనలో సన్ రైజర్స్ టీమ్ 16.4 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌట్ అయింది. క్లాసెన్ 33, కమిందు మెండిస్ 27, నితీశ్ కుమార్ రెడ్డి 19, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 14 పరుగులు చేశారు.
ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఎలాంటి ఇంపాక్ట్ చూపించకుండానే వెనుదిరిగాడు. హెడ్ కేవలం 4 పరుగులకే అవుటయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 2, వన్ డౌన్ ఆటగాడు ఇషాన్ కిషన్ 2 పరుగుల స్కోరుకే అవుటవడంతో సన్ రైజర్స్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో వైభవ్ అరోరా 3, వరుణ్ చక్రవర్తి 3, ఆండ్రీ రసెల్ 2, హర్షిత్ రాణా 1, సునీల్ నరైన్ 1 వికెట్ తీశారు.