Narendra Modi: థాయ్ మహిళా ప్రధాని షినవత్రా నుంచి ప్రధాని మోదీకి విశిష్ట కానుక

Thai PM Gifts Rare Buddhist Text to PM Modi

  • థాయ్‌లాండ్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ
  • థాయ్ ప్రధాని షినవత్రాతో ద్వైపాక్షిక సమావేశం
  • ఈ సందర్భంగా మోదీకి తిపిటక గ్రంథం బహూకరణ

భారత ప్రధాని నరేంద్ర మోదీకి థాయ్‌లాండ్ ప్రధాని పెటోంగ్‌టార్న్ షినవత్రా విశిష్ట కానుకను అందజేశారు. బ్యాంకాక్‌లో జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా 'ది వరల్డ్ తిపిటక: సజ్జాయ ఫొనెటిక్ ఎడిషన్' పేరు గల బౌద్ధ గ్రంథాన్ని మోదీకి బహుకరించారు. ఈ చర్య భారత్, థాయ్‌లాండ్ మధ్య బలమైన సాంస్కృతిక, భాషాపరమైన, మతపరమైన సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

'తిపిటక' అంటే పాలీ భాషలో 'మూడు బుట్టలు'. ఇది బౌద్ధ ధర్మ గ్రంథాలలో ప్రధానమైనది. ఇందులో బౌద్ధ సన్యాసుల నియమాలు, సూత్రాలు, బోధనలు సంగ్రహించబడి ఉంటాయి. ఈ గ్రంథం మొత్తం 108 సంపుటాలుగా ఉంది.

థాయ్ ప్రభుత్వం రాజు భూమిబల్ అతుల్యతేజ్ (రామ-9), రాణి సిరికిట్ 70వ వార్షికోత్సవం సందర్భంగా 2016లో 'వరల్డ్ తిపిటక ప్రాజెక్ట్'లో భాగంగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను ప్రచురించింది. పాలి, థాయ్ లిపులలో రూపొందించబడిన ఈ గ్రంథం, తొమ్మిది మిలియన్లకు పైగా పదాలను కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది కచ్చితమైన ఉచ్ఛారణతో పఠించేందుకు వీలుగా రూపొందించబడింది.

కానుక అందుకున్న సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ, "ప్రధాని షినవత్రా నాకు తిపిటకను బహుమతిగా ఇచ్చారు. లార్డ్ బుద్ధుని పుణ్యభూమి అయిన భారతదేశం తరపున నేను దానిని వినయంగా స్వీకరించాను. గత సంవత్సరం, భారతదేశం లార్డ్ బుద్ధుని పవిత్ర అవశేషాలను, ఇద్దరు ప్రధాన మతగురువులను థాయ్‌లాండ్‌కు పంపింది. దాదాపు నాలుగు మిలియన్ల మంది ప్రజలు ఆ అవశేషాలకు నివాళులర్పించారని తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.

థాయ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, థాయ్‌లాండ్ రాజులు బౌద్ధమత సంరక్షకులుగా ఉండటంతో పాటు, తిపిటకను ఇతర దేశాలకు వ్యాప్తి చేయడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.

Narendra Modi
Thai PM
Pettongtarn Shinawatra
Tripitaka
Buddhist scriptures
India-Thailand relations
Gift
Diplomatic visit
Bangkok
Cultural exchange
  • Loading...

More Telugu News