తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త!
- ఆదిలాబాద్ విమానాశ్రయానికి ఉత్తర్వులు జారీ
- ఇటీవల మామునూరు విమానాశ్రయానికి కేంద్రం అనుమతి
- ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ ప్రజలకు శుభవార్త అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఇంతకుముందు మామునూరు విమానాశ్రయానికి అనుమతులు సాధించిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు ఆదిలాబాద్ విమానాశ్రయానికి కూడా అనుమతులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆరు నెలల వ్యవధిలోనే రెండు విమానాశ్రయాలకు అనుమతులు రావడం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి దక్కిన విజయమని అన్నారు.
ఈ విమానాశ్రయాన్ని పౌర విమానాలు, ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని వాయుసేన సూచించినట్లు మంత్రి తెలిపారు. అవసరమైన భూమిని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించాలని అధికారులు లేఖలో సూచించారని వెల్లడించారు. తెలంగాణలో విమానాశ్రయాల అనుమతుల మంజూరుకు సహకరిస్తున్నందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.