ల‌క్నో బౌల‌ర్ కొంప‌ముంచిన అత్యుత్సాహం.. మ్యాచ్ ఫీజులో భారీగా కోత‌.. పైగా..!

  • పంజాబ్‌తో మ్యాచ్‌లో ల‌క్నో బౌల‌ర్ దిగ్వేశ్ సింగ్ అత్యుత్సాహం
  • పంజాబ్‌ బ్యాట‌ర్ ప్రియాన్ష్ ఆర్య‌ను ఔట్ చేసిన త‌ర్వాత అనుచిత ప్ర‌వ‌ర్తన
  • పెవిలియ‌న్ వెళుతున్న‌ అత‌ని వ‌ద్ద‌కు వెళ్లి లెట‌ర్ రైటింగ్ సంజ్ఞ చేస్తూ సెల‌బ్రేష‌న్స్‌
  • దిగ్వేశ్ సింగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత.. అత‌ని ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్
ఐపీఎల్‌లో ల‌క్నోతో మంగ‌ళ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) బౌల‌ర్ దిగ్వేశ్ సింగ్ రాతీకి బీసీసీఐ భారీ జ‌రిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించ‌డంతో పాటు అత‌ని ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ కూడా జోడించింది. 

పంజాబ్ కింగ్స్ (పీపీకేఎస్‌) ఓపెన‌ర్‌ బ్యాట‌ర్ ప్రియాన్ష్ ఆర్య‌ను ఔట్ చేసిన త‌ర్వాత... అత‌ని వ‌ద్ద‌కు వెళ్లి లెట‌ర్ రైటింగ్ సంకేతం చేస్తూ బ్యాట‌ర్‌ను అవ‌మానించాడు. ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘించినందుకు గాను  దిగ్వేశ్ సింగ్‌కు జ‌రిమానా విధిస్తున్న‌ట్లు బీసీసీఐ పేర్కొంది.

పంజాబ్‌ ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్‌లో షార్ట్ బంతిని పుల్ షాట్ ఆడ‌బోయిన ప్రియాన్ష్ క్యాచ్ ఔట‌య్యాడు. బ్యాట్‌ టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి శార్దూల్ చేతిలో ప‌డింది. ఔటైన త‌ర్వాత పెవిలియ‌న్‌కు వెళ్తున్న స‌మ‌యంలో ప్రియాన్ష్ వ‌ద్ద‌కు వెళ్లి దిగ్వేశ్ సింగ్‌ లెట‌ర్ రాస్తున్న‌ట్లు సంకేతం చేశాడు. ఆ అత్యుత్సాహమే ఇప్పుడు అత‌ని కొంప‌ముంచింది. కాగా, గతంలో ఈ ఇద్ద‌రూ ఢిల్లీ టీ20 లీగ్‌లో ఒకే జ‌ట్టు త‌ర‌ఫున ఆడారు. 


More Telugu News