Payal Rajput: ఇండస్ట్రీలో అలాంటి వాళ్లకే అవకాశాలు వస్తున్నాయి: పాయల్ రాజ్ పుత్ ఆవేదన

Tollywood Actress Payal Rajput Speaks Out Against Nepotism
 
ఆర్ఎక్స్100 సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన పాయల్ రాజ్ పుత్... ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. 

"నటులుగా కెరీర్ ప్రారంభించడం చాలా కష్టం. ప్రతిరోజూ ఏదో ఒక అనిశ్చితి వెంటాడుతూనే ఉంటుంది. బంధుప్రీతి, వివక్ష రాజ్యమేలుతున్న ఈ ప్రపంచంలో టాలెంట్ ఉన్నా నిరూపించుకోవడం కష్టంగా మారుతోంది" అని పాయల్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇండస్ట్రీలో పేరున్న కుటుంబాల నుంచి వచ్చిన వారికే అవకాశాలు దక్కుతున్నాయని, టాలెంట్ ఉన్నా సరైన గుర్తింపు లభించడం లేదని ఆమె పరోక్షంగా వ్యాఖ్యానించింది. 

"ఆధిపత్య ధోరణులు ఎక్కువగా ఉండే ఈ (సినీ) ప్రపంచంలో నా శ్రమ, అంకితభావం నిజంగా ఫలితాన్నిస్తాయా అని ప్రశ్నించుకున్నప్పుడు... ఏమో అనే సందేహం కలుగుతుంది. బాగా పేరుప్రఖ్యాతులు కలిగిన ఇంటి పేర్లు కలిగిన వారికి, సమర్థులైన ఏజెంట్లు ఉన్నవారికి అవకాశాలు వెళ్లడాన్ని గమనించాను. నా ప్రతిభతో నేను ఇక్కడ నెగ్గుకురాగలనా అని ఆలోచిస్తుంటాను. అందుకే నటులుగా ఉండడం కంటే కఠినమైన కెరీర్ మరొకటి ఉండదేమో! ప్రతి రోజూ అనిశ్చితే! ఎందుకంటే ఇక్కడ బంధుప్రీతి, పక్షపాతం అనే అంశాలు ప్రతిభను తెరమరుగు చేస్తుంటాయి" అని పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. 

కాగా, నెటిజన్లు పాయల్ రాజ్ పుత్ కు మద్దతు పలుకుతున్నారు. ఇండస్ట్రీలో ఎవరి అండ లేకుండా వచ్చిన నటీనటులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నారని, వారసులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని పలువురు నెటిజన్లు సైతం కామెంట్ చేస్తున్నారు. 

అయితే, పాయల్ చేసిన ఈ వ్యాఖ్యలపై కొందరు సినీ విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టాలెంట్ ఉంటే ఎవరి అండ లేకున్నా రాణించవచ్చని, అవకాశాలు రావడం అనేది వ్యక్తిగత నైపుణ్యంపై ఆధారపడి ఉంటుందని వారు అంటున్నారు.
Payal Rajput
Tollywood
Telugu Film Industry
Nepotism
RX100
Film Career
Struggle in Film Industry
Bollywood
Indian Cinema
Talent vs Nepotism

More Telugu News