Chandrababu Naidu: ఇప్పుడు నేనిచ్చే పింఛన్లు ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు సమానం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu on Andhra Pradeshs Pension System
  • బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • పర్చూరు నియోజకవర్గం కొత్త గొల్లపాలెం గ్రామంలో పింఛన్ల పంపిణీ
  • ఇంటింటికీ తిరిగి పింఛన్లు ఇచ్చిన సీఎం
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కొత్త గొల్లపాలెంలో సీఎం చంద్రబాబు పేదల సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు అనంతరం ప్రజా సభకు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ... ఇప్పుడు తాను ఇస్తున్న ఫించన్లు ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు సమానం అని అన్నారు. పింఛన్ల రూపంలో నెలకు రూ.2,722 కోట్లు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఏడాదికి రూ.33,100 కోట్లు ఖర్చవుతోందని తెలిపారు. గతంలో ఒక నెల పింఛను తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదని, కానీ నేను ఒక నెల పింఛను తీసుకోకపోతే రెండవ లేదా మూడో నెల తీసుకునే అవకాశం ఇచ్చానని వివరించారు. రెండు నెలలు పింఛన్లు తీసుకోనివారు 93,300 మంది ఉన్నారని వెల్లడించారు. 

డబ్బు మిగుల్చుకోవాలనుకుంటే నెలకు రూ.76 కోట్లు మిగులుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. పేదలకు అండగా ఉండాలని నెలకు అదనంగా రూ.76 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని కోటిన్నర లక్షల కుటుంబాలకు గాను 64 లక్షల పింఛన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సగటున రెండున్నర కుటుంబాలకు  పింఛను ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని అన్నారు. కొందరికి సంపాదించే దాని కంటే ఎక్కువ ఆదాయం వస్తోందని తెలిపారు. 

పింఛన్ల పంపిణీ సజావుగా సాగుతోందా? లేదా? అనేది తెలుసుకుంటున్నానని అన్నారు. పింఛన్లు తీసుకోవడం ప్రజల హక్కు... గౌరవంగా పింఛన్లు ఇవ్వాలని సిబ్బందికి చెబుతున్నామని స్పష్టం చేశారు. ప్రతి నెల 1వ తారీఖునే 98 శాతం పింఛన్లు పంపిణీ చేస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. 

"పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే నా జీవితాశయం. అందుకే మార్గదర్శి బంగారు కుటుంబం పేరుతో కొత్త విధానం తీసుకువస్తున్నాం. పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తాం. ఇంటింటికీ సౌర విద్యుత్ వెలుగులు అందాలి. తాగునీరు, డ్రెయినేజి, వంట గ్యాస్, ఇంటర్నెట్ సహా అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. ప్రతి గ్రామం మోడల్ గ్రామం రూపుదిద్దుకోవాలి. ప్రజలే ముందు... ఆ తర్వాతే మిగతా పనులు. ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాను. రాష్ట్ర  పునర్ నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని గతంలోనే చెప్పాను. గతంలో ఇచ్చిన మాట ప్రకారమే ముందుకెళుతున్నాం" అని వివరించారు.
Chandrababu Naidu
Pension Scheme
Andhra Pradesh
Welfare Schemes
Financial Assistance
Social Welfare
Poverty Alleviation
India
Pension Distribution
Government Schemes

More Telugu News