రంజాన్ వేళ అభిమానులను పలకరించిన సల్మాన్ ఖాన్... కానీ!

  • నేడు ఈద్ ఉల్ ఫితర్
  • సల్మాన్ ఇంటికి భారీగా తరలివచ్చిన అభిమానులు
  • ఈసారి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుల వెనుక నుంచి అభివాదం చేసిన సల్మాన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నేడు రంజాన్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. తనకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపేందుకు ముంబయిలోని తన నివాసం వద్దకు భారీగా తరలివచ్చిన అభిమానులకు ఆయన అభివాదం చేశారు. 

అయితే, ప్రతి సంవత్సరం ఈద్ వేడుకల్లో తన ఇంటి బాల్కనీ నుంచి అభిమానులకు అభివాదం చేసే సల్మాన్, ఈసారి మాత్రం బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుక నుంచి కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. గతంలో సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో, ఆయనకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే బాల్కనీకి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను ఏర్పాటు చేశారు. ఈద్ రోజున అభిమానులను నిరాశపరచకూడదనే ఉద్దేశంతో, సల్మాన్ వాటి వెనుక నుంచే అందరికీ అభివాదం చేశారు. 

తెల్లని పఠానీ సూట్‌లో మెరిసిన సల్మాన్, బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుల వెనుక నుంచే అభిమానులకు ఈద్ ముబారక్ తెలిపారు. "షుక్రియా, థాంక్యూ, సబ్ కో ఈద్ ముబారక్" అంటూ తన ప్రేమను చాటుకున్నారు. 

గత సంవత్సరం ఏప్రిల్‌లో గుర్తు తెలియని వ్యక్తులు సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత సల్మాన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
.


More Telugu News