జ‌స్ప్రీత్‌ బుమ్రాను ఎదుర్కోవ‌డం అంత ఈజీ కాదు: మ‌హ్మ‌ద్ రిజ్వాన్

  • తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న రిజ్వాన్‌, ఫ‌ఖ‌ర్‌, న‌సీమ్ షా
  • రిజ్వాన్‌, ఫ‌ఖ‌ర్‌కు ప్ర‌స్తుత క్రికెట్‌లో ప్ర‌మాద‌క‌ర‌మైన బౌల‌ర్‌ ఎవ‌రు అనే ప్ర‌శ్న
  • దీనికి రిజ్వాన్ బుమ్రా పేరు చెప్ప‌గా.. జోప్రా ఆర్చ‌ర్ పేరు చెప్పిన ఫ‌ఖ‌ర్‌
  • తాను బౌలింగ్ చేయ‌డానికి ఇబ్బంది ప‌డే బ్యాట‌ర్‌ బ‌ట్ల‌ర్ అన్న న‌సీమ్ షా
పాకిస్థాన్ వ‌న్డే కెప్టెన్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌, మ‌రో స్టార్ బ్యాట‌ర్ ఫ‌ఖ‌ర్ జ‌మాన్‌, స్టార్ బౌల‌ర్ న‌సీమ్ షా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రిజ్వాన్‌, ఫ‌ఖ‌ర్‌కు ప్ర‌స్తుత క్రికెట్‌లో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన బౌల‌ర్ ఎవ‌రు అనే ప్ర‌శ్న ఎదురైంది. దీనికి వారిద్ద‌రు చెరో బౌల‌ర్ పేరు చెప్పారు. 

ప్ర‌స్తుత క్రికెట్‌లో టీమిండియా పేస‌ర్ జ‌స్ప్రీత్‌ బుమ్రాను ఎదుర్కొవ‌డం అంత ఈజీ కాద‌ని రిజ్వాన్ అన్నాడు. తాను క్రికెట్ మొద‌లు పెట్టిన‌ప్పుడు ఆస్ట్రేలియా పేస‌ర్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఆడాలంటే భ‌య‌ప‌డేవాడిన‌ని తెలిపాడు. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని బుమ్రా భ‌ర్తీ చేశాడ‌న్నాడు. టీమిండియా స్పీడ్‌స్ట‌ర్‌ను ఎదుర్కోవ‌డం క‌ఠిన‌మైన స‌వాల్‌గా రిజ్వాన్ చెప్పాడు.

అలాగే ఫ‌ఖ‌ర్ జ‌మాన్ మాట్లాడుతూ... పిచ్ స్వ‌భావాన్ని బ‌ట్టి తాను క‌ఠిన‌మైన బౌల‌ర్‌ను నిర్ణ‌యిస్తాన‌న్నాడు. అయితే, కొత్త బంతితో మాత్రం జోఫ్రా ఆర్చ‌ర్‌ను మించిన ప్ర‌మాద‌క‌ర‌ బౌల‌ర్ మ‌రొక‌రు లేర‌ని తెలిపాడు. కొత్త బంతితో బౌలింగ్ విష‌యంలో ఆర్చ‌ర్‌ను ఎదుర్కోవ‌డం చాలా క‌ష్ట‌మ‌ని ఫ‌ఖ‌ర్ తెలిపాడు. 

ఇక న‌సీమ్ షా తాను బౌలింగ్ చేయ‌డానికి ఇబ్బంది ప‌డే బ్యాట‌ర్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ పేరు చెప్పాడు. వైట్‌-బాల్ క్రికెట్‌లో అత‌డు విధ్వంస‌క‌ర‌ బ్యాట‌ర్ అని పేర్కొన్నాడు. 

ఇదిలా ఉంటే... పాకిస్థాన్ క్రికెట్‌ జ‌ట్టు ప్ర‌స్తుతం న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ టూర్‌లో ఇప్ప‌టికే ఆ టీమ్‌ 5 మ్యాచ్ ల టీ20 సిరీస్‌ను 4-1తో కోల్పోయింది. అలాగే ఇప్పుడు జరుగుతున్న మూడు వ‌న్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ లో ఘోర ఓట‌మిని చ‌విచూసింది. 73 ర‌న్స్ తేడాతో ప‌రాజ‌యం పాలైంది. రిజ్వాన్ కెప్టెన్సీలోనే పాక్ ఆడుతున్న విష‌యం తెలిసిందే.    




More Telugu News