Nara Lokesh: ఈసారి కడపలో మహానాడు... మే నెలలో టీడీపీ పండుగ: మంత్రి లోకేశ్‌

TDP Party Workers Meeting Minister Nara Lokeshs Key Announcements
  • ఉత్తమ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌
  • కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామ‌ని హామీ
  • భిన్నాభిప్రాయాలు ఉన్నా అందరూ కలసికట్టుగా ముందుకుసాగాల‌ని సూచ‌న‌
  • జూన్ నుంచి పార్టీ సాధించిన విజయాల‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాల‌ని పిలుపు
  • 3సార్లు ఉత్తమ కార్యకర్త అవార్డు అందుకున్న ఆదిరెడ్డికి ప్రత్యేక అభినందన
యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో జ‌రిగిన‌ ఉత్తమ కార్యకర్తల సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై జూన్ నుంచి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. పెన్షన్లు, అన్నక్యాంటీన్, స్టీల్ సిటీ, ఎన్టీపీసీ, బల్క్ డ్రగ్ పార్కు వంటి విజయగాధలను ప్రజల్లోకి తీసుకెళ్లాల‌ని సూచించారు. చేసిన పనులు చెప్పుకోకపోతే ప్రత్యర్థులు చెప్పే అబద్ధాలు జనంలోకి వెళతాయ‌ని, ఈ విషయంలో పార్టీ కేడర్ అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. 

మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ... ఇటీవల నేను డిల్లీలో ఒక ఫంక్షన్ కు వెళ్లాను. అక్కడ మన సభ్యత్వం గురించే చర్చ జరుగుతోంది. మేం 5 లక్షలు కూడా చేయలేకపోతున్నాం, మీరు కోటి సభ్యత్వాలు ఎలా చేశారని అడిగారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు హయాం నుంచి సభ్యత్వం మనకు ఒక ఎమోషన్. యలమంచిలి నియోజకవర్గంలో 41 వేల సభ్యత్వాలు నమోదు చేసినందుకు అభినందనలు. 

యువగళం పాదయాత్రలో కష్టపడిన కార్యకర్తలను గుర్తించాలని ఇక్కడ కార్యకర్తలు నాకు చెప్పారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ, సోషల్ మీడియా, సభ్యత్వ నమోదులో మెరుగైన పనితీరు కనబర్చిన వారి వివరాలను ఆన్ లైన్ లో పెట్టా. ఎవరు పనిచేస్తున్నారో తెలుసుకునేందుకు ఈ విధానం అమలుచేస్తున్నాం. టీడీపీలో  కష్టపడిన కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు ఇస్తాం. ఈ విషయంలో క్లారిటీతో ఉన్నాం. కష్టపడి పార్టీకోసం పనిచేయండి. ప్రస్తుత మన ప్రభుత్వం ఐదేళ్లు ఉంటుంది. తొలిసారి అవకాశం రాకపోయినా మూడు విడతల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం. అధైర్యపడవద్దు అని లోకేశ్ చెప్పారు.

అలకలు మాని పార్టీ కోసం పనిచేయండి...

మే తర్వాత కేడర్ అంతా ప్రజల్లోకి వెళ్లాలి. మే నెలలో కడపలో మహానాడు నిర్వహించబోతున్నాం. ఈలోగా కుటుంబ సాధికార సమితులు, బూత్, క్లస్టర్ కమిటీలు, అనుబంధ సంఘాలు, జిల్లా కమిటీల నియమకాన్ని పూర్తి చేస్తాం. మహానాడులో జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాత రాష్ట్ర కమిటీ నియమాకం చేపడతాం. పార్టీ కేడర్ అంతా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రజల్లోకి వెళ్లాలి. జగన్ పై కంటే పార్టీ కార్యకర్తల కోసమే నేను ఎక్కువగా పోరాడుతుంటాను. సమస్యలపై నిర్ణయం తీసుకునే వరకు అందరం కూర్చుని చర్చిద్దాం. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక అందరం కలిసి పనిచేయాల్సిందే. అలకలుమాని నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలి.

ఇకపై నిరంతరం యువరక్తం ఎక్కిస్తాం...

ఇకపై పార్టీలో నిరంతరం యువరక్తం నింపాలని నిర్ణయించాం. యువత రాజకీయాల్లోకి రావాలి. ఏ నాయకుడు కూడా ఒకే పదవిలో మూడుసార్లకు మించి ఉండకూడదని ప్రతిపాదిస్తున్నాం. గ్రామస్థాయి అధ్యక్షుడికి కూడా పొలిట్ బ్యూరోలో స్థానం లభించే పరిస్థితి రావాలి. పార్టీలో కరడుగట్టిన కార్యకర్తలంతా అయిదేళ్లు నరకం అనుభవించారు. ఎన్నో కేసులుపెట్టి హింసించారు. హోంమంత్రి అనితపై కూడా 23 కేసులు ఉన్నాయి. పాదయాత్ర సమయంలో పోలీసులు నాకు సెక్యూరిటీ అడిగితే ఇవ్వలేదు. ఇప్పుడు వద్దంటే వస్తున్నారు. రామతీర్థం వెళ్లడానికి బాబు గారు విశాఖ ఎయిర్ పోర్టుకు వస్తే రోడ్డుకు అడ్డుగా పొక్లయినర్లు పెట్టారు. పాదయాత్ర సమయంలో నా స్టూల్, మైక్ లాక్కున్నారు. ఈరోజు టైం బాగుంది కదా అని గతాన్ని మర్చిపోవద్దు. కుటుంబంలో మాదిరి పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. పరిష్కరించుకొని ముందుకు సాగాలి.

ఓర్పు, సహనంతో ప్రజల్లోకి వెళ్లండి...

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే ఫస్ట్. కేడర్ కార్యాలయాలకు వెళ్లి చట్టపరంగా పరిష్కరించరించగలిగిన సమస్యలను స్థానికంగా పరిష్కరించేందుకు చొరవచూపాలి. మే నెల నుంచి ప్రతిరోజూ 300 మందికి చొప్పున పార్టీ కేడర్ కు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తాం. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించుకోవాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది. మరో రెండు నెలల్లో మహానాడు నిర్వహించుకోబోతున్నాం. ఇతర పార్టీ ఎమ్మెల్యే ఉన్నచోట సమన్వయ లోపం కారణంగా సమస్యలు వస్తున్నాయి. ఎమ్మెల్యే లేనిచోట అక్కడ ఇన్ చార్జి ప్రతి వారం కూర్చుని మాట్లాడుకోవాలి. చట్టపరిధిలోని పనుల కోసం కార్యకర్తలు కార్యాలయాలకు వెళితే పనులు చేయాల్సిందే. ఓర్పు, సహనంతో ప్రజల్లోకి వెళ్లాలి అని మంత్రి లోకేశ్‌ కార్యకర్తలను కోరారు. ఈ సందర్భంగా ఉత్తమ కార్యకర్తలను మంత్రి అభినందించారు. సభ్యత్వం, మన టీడీపీ, భవిష్యత్తుకు గ్యారంటీ వంటి అంశాల్లో అవార్డు అందుకున్న ధర్మాల ఆదిరెడ్డి అనే కార్యకర్తను ప్రత్యేకంగా అభినందించారు.

తప్పుడు కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటాం...

ఈ సమావేశంలో పలు సమస్యలను కార్యకర్తలు మంత్రి లోకేశ్‌ దృష్టికి తెచ్చారు. వైసీపీ సర్పంచ్ లతో పాటు 10 శాతం వైసీపీ వారు కూడా టీడీపీ సభ్యత్వ కార్డులు తీసుకున్నారని తెలిపారు. అచ్యుతాపురం సెజ్ కు సంబంధించి ఆర్ అండ్ ఆర్ లో ఇంకా 200 మందికి స్థలాలు ఇవ్వలేద‌ని, ఆ సమస్యను పరిష్కరించాల‌ని కోరారు. పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ నిర్మించాల‌ని విన్న‌వించారు. ఉపాధి హామీ, నీరు-చెట్టు బిల్లులు చెల్లించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని కోరారు. ఉపాధి హామీ, నీరు-చెట్టు బిల్లులు, తప్పుడు కేసులకు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని సంప్రదించాలని మంత్రి లోకేశ్ కార్య‌క‌ర్త‌ల‌ను సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ దామచర్ల సత్య, యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి ప్రగడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 
Nara Lokesh
TDP
Andhra Pradesh Politics
Telugu Desam Party
Party Workers
Nara Lokesh Speech
Yelamanchili
Achyutapuram
Political Meeting
Party Membership

More Telugu News