Vangalapudi Anita: క్యాన్సర్ పేషెంట్ కు ఫోన్ ద్వారా ధైర్యం చెప్పిన హోంమంత్రి అనిత

Minister Vangalapudi Anita Encourages Cancer Patient via Video Call
  • క్యాన్సర్ పేషంట్ కు వీడియో కాల్ చేసి మాట్లాడిన మంత్రి అనిత
  • శ్రీకాకుళం వచ్చి స్వయంగా కలుస్తానని హామీ
  • ప్రభుత్వం తరపున కావాల్సిన సహకారం అందిస్తామని భరోసా
శ్రీకాకుళంకు చెందిన క్యాన్సర్ బాధిత మహిళతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాల్ ద్వారా మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పారు. మృత్యువుతో పోరాడుతున్న లతశ్రీ అనే మహిళ తనను కలవాలని ఆశపడుతున్న విషయాన్ని ఆమె భర్త ఆనంద్ ద్వారా తెలుసుకున్న మంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఆమెకు వీడియో కాల్ చేసి పలకరించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

క్యాన్సర్‌ను జయించిన ఎంతో మంది గురించి ఆమెకు వివరించి ధైర్యంగా ఉండాలని మంత్రి చెప్పారు. ధైర్యానికి మించిన ఔషధం ఏదీ లేదని అన్నారు. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారు కూడా ధైర్యంగా ఎదుర్కొని ఆరోగ్యంగా ఉంటున్నారని, మీరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దని ఆమెకు మంత్రి సూచించారు.

ఈ సందర్భంగా నేరుగా కలవాలని ఉందని లతశ్రీ కోరగా, త్వరలో శ్రీకాకుళం వచ్చి కలుస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడు మాట్లాడాలని అనిపించినా వెంటనే తనకు ఫోన్ చేసి మాట్లాడవచ్చని మంత్రి ఆమెకు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతోనూ మంత్రి అనిత మాట్లాడారు. లతశ్రీ కోలుకొని మళ్లీ సాధారణ జీవనం గడపడానికి ప్రభుత్వం తరపున కావాల్సిన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

మంత్రి స్వయంగా వీడియో కాల్ చేసి మాట్లాడటంతో లతశ్రీ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, లతశ్రీతో వీడియో కాల్‌లో మాట్లాడిన ఫోటోలను మంత్రి అనిత తన సోషల్ మీడియా ఖాతా 'ఎక్స్'లో పోస్ట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
Vangalapudi Anita
Andhra Pradesh Home Minister
Cancer Patient
Video Call
Encouragement
Latha Sri
Srikakulam
Hope
Support
Social Media

More Telugu News