Nitish Rana: నితీశ్ రాణా విధ్వంసక ఇన్నింగ్స్... రాజస్థాన్ రాయల్స్ 182/9

- గువాహటిలో చెన్నై సూపర్ కింగ్స్ × రాజస్థాన్ రాయల్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై
- 36 బంతుల్లో 81 పరుగులు చేసిన నితీశ్ రాణా
- 10 ఫోర్లు, 5 సిక్సర్లతో విజృంభణ
ఐపీఎల్ లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది.
రాజస్థాన్ ఇన్నింగ్స్ లో నితీశ్ రాణా బ్యాటింగే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గత రెండు మ్యాచ్ ల్లో తక్కువ స్కోరుకు అవుటైన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆటగాడు... నేడు గువాహటిలోని బర్సపారా స్టేడియంలో చెలరేగిపోయాడు. నితీశ్ రాణా 36 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. రాణా స్కోరులో 10 ఫోర్లు, 5 భారీ సిక్సులు ఉన్నాయి. నితీశ్ రాణా చేసింది 81 పరుగులు అయితే... అందులో 70 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే వచ్చాయి.
ఇక సంజు శాంసన్ 20, కెప్టెన్ రియాన్ పరాగ్ 37, హెట్మెయర్ 19 పరుగులు చేశారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4), వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (3) విఫలమయ్యారు. సీఎస్కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2, నూర్ అహ్మద్ 2, మతీశ పతిరణ 2, అశ్విన్ 1, జడేజా 1 వికెట్ తీశారు.