Sunrisers Hyderabad: విశాఖలో చిత్తుగా ఓడిన సన్ రైజర్స్... చితకబాదిన డీసీ బ్యాటర్లు

Sunrisers Hyderabad Crushed by Delhi Capitals in Visakhapatnam IPL Match
  • విశాఖలో సన్ రైజర్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
  • 7 వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ జట్టు
  • మొదట 163 పరుగులకు ఆలౌట్ అయిన సన్ రైజర్స్
  • 16 ఓవర్లలో కొట్టేసిన ఢిల్లీ క్యాపిటల్స్
విశాఖపట్నంలో ఈ సాయంత్రం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం చవిచూసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్ హెచ్ కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ధాటికి 18.4 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌట్ అయింది. స్టార్క్ ఐదు వికెట్లు తీసి సన్ రైజర్స్ ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. మిడిలార్డర్ లో అనికేత్ వర్మ పోరాడబట్టి హైదరాబాద్ టీమ్ కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. అనికేత్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులతో 74 పరుగులు చేశాడు.

 ఇక, కష్ట సాధ్యం కాని లక్ష్యఛేదనకు బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ పరుగుల మోత మోగించింది. 164 పరుగుల లక్ష్యాన్ని డీసీ 16 ఓవర్లలో 3 వికెట్లకు ఛేదించింది.  

ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ (38), ఫాఫ్ డుప్లెసిస్ (50) తొలి వికెట్ కు 81 పరుగులు జోడించి శుభారంభం అందించారు. వీరిద్దరూ అవుటైన తర్వాత అభిషేక్ పోరెల్ (34 నాటౌట్), ట్రిస్టాన్ స్టబ్స్ (21 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. కేఎల్ రాహుల్ 15 పరుగులు చేసి అవుటయ్యాడు. 

సన్ రైజర్స్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ 3 వికెట్లతో రాణించాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మహ్మద్ షమీ ఘోరంగా విఫలమయ్యారు. కమిన్స్, షమీ బౌలింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు భారీ షాట్లతో బెంబేలెత్తించారు. షమీ 3 ఓవర్లలో 31 పరుగులు ఇవ్వగా, కమిన్స్ 2 ఓవర్లలోనే 27 పరుగులు సమర్పించుకున్నాడు.
Sunrisers Hyderabad
Delhi Capitals
IPL 2023
Mitchell Starc
Anirudh Varma
Visakhapatnam
IPL Match
Cricket
DC win
SRH loss

More Telugu News