బ్యాంకాక్ భూకంపం నుంచి త‌ప్పించుకుని.. స్వ‌దేశానికి క్షేమంగా ఎమ్మెల్యే ఫ్యామిలీ

  • బ్యాంకాక్ భూకంపంలో చిక్కుకున్న ఎమ్మెల్యే మ‌క్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ ఫ్యామిలీ
  • శ‌నివారం మ‌ధ్యాహ్నం క్షేమంగా స్వ‌స్థ‌లానికి చేరుకున్న వైనం
  • తృటిలో ప్రాణాలు ద‌క్కించుకుని వ‌చ్చిన‌ ఫ్యామిలీని చూసి ఎమ్మెల్యే భావోద్వేగం
బ్యాంకాక్ భూకంపంలో చిక్కుకున్న రామగుండం ఎమ్మెల్యే మ‌క్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ కుటుంబ స‌భ్యులు స్వ‌దేశానికి చేరుకున్నారు. ఆయ‌న‌ భార్య మ‌నాలి, కుమార్తె మాన‌స‌, కుమారులు ప్ర‌తీక్‌, నిధిశ్ న‌లుగురు శ‌నివారం మ‌ధ్యాహ్నం క్షేమంగా స్వ‌స్థ‌లానికి చేరుకున్నారు. తృటిలో ప్రాణాలు ద‌క్కించుకుని శంషాబాద్ విమానాశ్ర‌యానికి వ‌చ్చి త‌న ఫ్యామిలీని చూసి ఎమ్మెల్యే భావోద్వేగానికి గుర‌య్యారు. 

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... బంధువుల పెళ్లి కోసం వారు బ్యాంకాక్ వెళ్లారు. ఊహించ‌ని పెను ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకుని ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌టం అనేది దేవుడి ద‌య వ‌ల్లే జ‌రిగింది. అని మ‌క్కాన్ సింగ్ ఎమోష‌న‌ల్ అయ్యారు. 

ఎమ్మెల్యే భార్య మ‌నాలి మాట్లాడుతూ... ‘బంధువుల వివాహ వేడుక కోసం బ్యాంకాక్‌ వెళ్లిన మేము నొవాటెల్ హోట‌ల్‌లోని 35వ అంత‌స్తులోని ఓ గ‌దిలో దిగాం. శుక్ర‌వారం ఉద‌యం భూప్ర‌కంప‌న‌లు మొద‌లు కావ‌డంతో ముగ్గురు పిల్ల‌ల‌ను తీసుకుని మెట్ల మార్గంలో వేగంగా బ‌య‌ట‌కు వ‌చ్చాను. బిల్డింగ్ పైక‌ప్పు పెచ్చులు ఊడిపోవ‌డం, ఓ ప‌క్క‌కు ఒరిగిపోవ‌డంతో ప్రాణాల‌పై ఆశ‌లు వ‌దులుకున్నాం. బ‌య‌ట‌కు వ‌చ్చి చూసేస‌రికి క‌ళ్ల ముందే భ‌వ‌నాలు పేక‌మేడ‌ల్లా కూలిపోవ‌డం చూసి చాలా భ‌య‌మేసింది’ అని మ‌నాలి చెప్పుకొచ్చారు.


More Telugu News