Painting Auction: 8.5 కోట్ల విలువైన చిత్రాన్ని రూ.వెయ్యికే సొంతం చేసుకున్న మహిళ.. పొరపాటుకు చింతిస్తున్న వేలం నిర్వాహకులు

Woman Buys 1 Million Dollars Worth Painting for Just 12 Dollars
  • పెన్సిల్వేనియాలో అరుదైన చిత్రాల వేలం
  • వేలంలో ఫ్రెంచ్ ఆర్టిస్టు గీసిన అరుదైన చిత్రం
  • పెయింటింగ్ విలువను గుర్తించడంలో పొరపాటు పడిన నిర్వాహకులు
ప్రముఖ చిత్రకారులు వేసిన పురాతన పెయింటింగ్ లను వేలంలో అమ్మడం మనం చూస్తూనే ఉంటాం.. అలాంటి వేలంలో పాల్గొన్న ఒక అమెరికన్ మహిళ తెలియకుండానే జాక్ పాట్ కొట్టేసింది. వేలంలో ఉంచిన ఓ చిత్రాన్ని 12 డాలర్లకు (సుమారు రూ.1000) కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వెళ్లింది. అయితే, అది అత్యంత అరుదైన చిత్రమని, దాని విలువ మిలియన్ డాలర్లు (సుమారు 8.5 కోట్ల రూపాయలు) ఉంటుందని తాజాగా బయటపడింది. దీంతో సదరు వేలం నిర్వాహకులు తలపట్టుకున్నారు. అత్యంత విలువైన చిత్రాన్ని నామమాత్రపు ధరకే అమ్మేశామని చింతిస్తున్నారు.

పెన్సిల్వేనియాకు చెందిన హెయిదీ మార్కోవ్ గత జనవరిలో భర్తతో కలిసి ఓ పెయింటింగ్ ఎగ్జిబిషన్ కు వెళ్లింది. అక్కడ పలు చిత్రాలను వేలం వేస్తుండడంతో అందులో పాల్గొంది. వేలంలో ఉంచిన చిత్రాలలో ఒక చిత్రం బాగా ఆకర్షించిందని, దానిని కొనివ్వాలని భర్తను అడిగానని చెప్పింది. తొలుత దానిని కొనడానికి భర్త విముఖత వ్యక్తం చేయగా.. తాను పట్టుబట్టడంతో 12 డాలర్లకు కొనుగోలు చేశాడని తెలిపింది. తీరా దానిని ఇంటికి తీసుకువెళ్లి పరిశీలించగా అసలు విషయం బయటపడిందని చెప్పింది.

ప్రముఖ ఫ్రెంచ్ ఆర్టిస్ట్ పియరే అగస్టీ రెనాయిర్ ఈ చిత్రాన్ని బొగ్గుతో గీసాడని, ఇది అత్యంత అరుదైన చిత్రమని తేలిందన్నారు. మార్కెట్లో ఈ పెయింటింగ్ విలువ సుమారు 1 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 8.5 కోట్లు) ఉండొచ్చని పేర్కొంది. అత్యంత అరుదైన, ఖరీదైన చిత్రాన్ని 12 డాలర్లకే సొంతం చేసుకున్నందుకు హెయిదీ సంతోషం వ్యక్తం చేస్తుండగా.. పెయింటింగ్ విలువను గుర్తించడంలో జరిగిన పొరపాటుకు సదరు వేలం నిర్వాహకులు చింతిస్తున్నారు.
Painting Auction
Rare Painting
Art Auction Mistake
Heidi Markov
Pierre-Auguste Renoir
Expensive Artwork
Pennsylvania Auction
French Art
Million Dollar Painting
Underpriced Art

More Telugu News