యువరాజ్‌సింగ్ తండ్రి యోగరాజ్ యూటర్న్.. ధోనీ-యువీని ఎప్పుడూ వేర్వేరుగా చూడలేదట!

  • యువరాజ్ సింగ్ కెరియర్‌ను ధోనీ నాశనం చేశాడని గతంలో ఆరోపించిన యోగరాజ్ సింగ్
  • అతడిని జీవితంలో క్షమించలేనన్న మాజీ క్రికెటర్
  • ఇప్పుడు మాటమార్చిన యోగరాజ్ సింగ్
వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోమారు వార్తల్లోకి ఎక్కాడు. ధోనీ కెప్టెన్సీలో తన కుమారుడి కెరియర్ నాశనమైందని గతంలో పలుమార్లు ఆరోపించాడు. యువీ కెరియర్‌ను నాశనం చేసిన ధోనీని ఎన్నటికీ క్షమించబోనని పేర్కొన్న యోగరాజ్ తాజాగా యూటర్న్ తీసుకున్నాడు. ధోనీ సహా భారత క్రికెటర్లు, యువరాజ్ మధ్య ఎన్నడూ భేదభావం చూపలేదని, అందరినీ ఒకేలా చూశానని చెప్పుకొచ్చాడు. 

‘ఫైండ్ ఏ వే విత్ తరువార్ కోహ్లీ’ అనే పాడ్‌కాస్ట్‌లో యోగ్‌రాజ్ మాట్లాడుతూ.. ‘‘యువరాజ్ సింగ్ సహా ధోనీ, భారత జట్టులోని ఇతర క్రికెటర్లు అందరినీ ఒకేలా చూశాను. వారిని ఎప్పుడూ వేర్వేరుగా చూడలేదు’’ అని పేర్కొన్నాడు.  యువరాజ్ సింగ్ కెరియర్ అర్ధాంతరంగా ముగిసిపోవడానికి ధోనీనే కారణమని ఇదే యోగరాజ్ సెప్టెంబర్ 2024లో ఆరోపించాడు.
 
‘‘ధోనీని క్షమించేదే లేదు. అతడు తన ముఖాన్ని అద్దంలో చూసుకోవాలి. అతడో పెద్ద క్రికెటర్. కానీ, నా కుమారుడి పట్ల మాత్రం వ్యతిరేకత ప్రదర్శించాడు. ఇప్పుడదంతా బయటకు వస్తోంది. అతడిని జీవితంలో క్షమించలేను’’ అని ఓ యూట్యూబ్ చానల్‌తో మాట్లాడుతూ చెప్పాడు. ధోనీ కనుక నా కుమారుడి జీవితాన్ని నాశనం చేయకుంటే మరో నాలుగైదేళ్లు ఆడేవాడు అని పేర్కొన్నాడు.

ధోనీ, యువరాజ్ సింగ్ తో కలిసి కొన్ని సంవత్సరాలపాటు డ్రెస్సింగ్ రూమును పంచుకున్నాడు. ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు యువరాజ్ సింగ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్నది కూడా అప్పుడే. 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో ధోనీ క్రీజులో ఉండగా యువరాజ్ సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించిపెట్టాడు. 

యువరాజ్ సింగ్ క్యాన్సర్ బారినపడ్డాక జట్టులోకి వస్తూపోతూ ఉండేవాడు. 2015లో ప్రపంచకప్ ఆడలేకపోయాడు. అయితే, అంతకుముందు ఏడాది జరిగిన ప్రపంచకప్, 2017 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. కాగా, ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో యువరాజ్ సింగ్ ఇండియా మాస్టర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ధోనీ ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.


More Telugu News