Nara Bhuvaneswari: ఏపీ ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్య్రం లభించింది: నారా భువనేశ్వరి

AP People Regain Freedom After 5 Years says Nara Bhuvaneswari
  • కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన
  • నేడు పలు గ్రామాల్లో ప్రజలను కలిసిన వైనం
  • ప్రజలు కాస్త ఓపిక పట్టాలని... చంద్రబాబు చెప్పినవన్నీ చేస్తారని స్పష్టీకరణ
ఏపీ ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్ర్యం లభించిందని, కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ మేలు జరుగుతుందని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు పాలనా సామర్థ్యం గురించి రాష్ట్ర ప్రజలకు తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పారిశ్రామికవేత్తలు ఏపీలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారంటే అందుకు చంద్రబాబు గారిపై ఉన్న నమ్మకమే కారణమన్నారు. 

రెండో రోజు కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా మోడల్ కాలనీ, కృష్ణదాసపల్లి, జరుగు గ్రామాల్లో నారా భువనేశ్వరి పర్యటించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమాల్లో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. మహిళలు తమపై తాము నమ్మకం పెట్టుకుని ధైర్యంగా ముందడుగు వేయాలని సూచించారు.  

కాస్త ఒపిక పట్టండి!

ఎన్నికల్లో గెలుపు కోసం కొందరు సాధ్యం కాని హామీలు ఇస్తారు. కానీ చంద్రబాబు గారు చెప్పారంటే చేతల్లో చేసి చూపిస్తారు. ప్రజలు కాస్త ఓపిక పట్టాలి. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయి. ఒక ఇండస్ట్రీ తీసుకురావాలంటే అంత ఆషామాషీ కాదు. 2019 తర్వాత చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఉంటే ఈపాటికి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ నిలిచేది. పోలవరం పూర్తయ్యేది.

రాష్ట్రాన్ని చంద్రబాబు నిలబెడతారు. రాష్ట్రమంతటా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీరు, సోలార్ ప్యానల్స్ ఏర్పాటు సహా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ నీటి సమస్య తీర్చేందుకు వీలైనంత త్వరగా హంద్రీనీవా పూర్తిచేసి అందరికీ నీరు అందిస్తారు.  గత ప్రభుత్వం ఐదేళ్లలో ఏం చేసిందో ప్రజలు,పారిశ్రామివేత్తలకు తెలుసు. 

డ్వాక్రాతో మహిళల జీవితాల్లో వెలుగులు

ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు. మహిళలు ఒకసారి చెబితే చాలు చక్కగా వింటారు. మహిళల్లో నాయకత్వ లక్షణాలు ఉండబట్టే కుటుంబాన్ని తీర్చిదిద్దుతున్నారు. మహిళల కోసం సీఎం చంద్రబాబు అనేక పథకాలు అమలు చేశారు. మహిళలు అన్ని రంగాల్లో మగవారిని మించి విజయాలు సాధించాలని చంద్రబాబు కోరుకుంటూ ఉంటారు. 

మహిళలు డబ్బు కోసం ఇబ్బంది పడకూడదని, వారు ఆర్థికంగా బలంగా ఉండాలనే ఉద్దేశంతోనే డ్వాక్రా సంఘాలు స్థాపించారు. ఒకప్పుడు వందా , రెండు వందల కోసం ఇతరులపై ఆధారపడిన స్త్రీలు నేడు బ్యాంకు లావాదేవీలు స్వయంగా చూసుకునే స్థాయికి చేరారంటే అది చంద్రబాబు తీసుకొచ్చిన డ్వాక్రాతోనే సాధ్యమైంది.

మగవాళ్లతో సమానంగా ఉద్యోగాలు చేస్తూనే మహిళలు ఇంటి బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. పిల్లల చదువులు చూసుకుంటున్నారు. వ్యాపారంలోకి రాకముందు నేను ఇంటి నుంచి బయటకు రావాలంటేనే సిగ్గుపడేదాన్ని. నేను ఏమైనా చేయగలను అనే ధైర్యం బిజినెస్ లోకి అడుగుపెట్టాకే వచ్చింది. మీ గౌరవం కోసం మీరు పనిచేయండి. మహిళలు తమ  సంపాదనను ముందుగా వారి అవసరాలకు వినియోగించుకోవాలి" అని నారా భువనేశ్వరి అన్నారు.
Nara Bhuvaneswari
Chandrababu Naidu
Andhra Pradesh
AP Politics
Kuppam
Development
Women Empowerment
DWACRA
Industrial Investments
Telugu Desam Party

More Telugu News