KTR: సత్సంబంధాలు ఉండాలని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.. మేము అలాగే ఉన్నాం: కేటీఆర్

KTR Slams Congress Over Central Budget Injustice to Telangana
  • కేంద్రంతో సఖ్యతతో ఉన్నప్పటికీ తెలంగాణకు ఏమీ రాలేదన్న కేటీఆర్
  • తెలంగాణ బాగుండాలన్నదే తమ సంకల్పమన్న కేటీఆర్
  • కేంద్ర బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీత
కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తాము కూడా కేంద్రంతో సఖ్యతగానే ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అయినప్పటికీ తెలంగాణకు ఏమీ రాలేదని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ బాగుండాలన్నదే తమ సంకల్పమని, తెలంగాణకు మేలు జరగాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలని కేటీఆర్ అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.

కాంగ్రెస్ నేతలు ప్రతి పనిలో గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని, మరి కేంద్ర ప్రభుత్వం తీరుపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభలో కేటీఆర్ మాట్లాడుతూ, పదవులు, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తించాలని వ్యాఖ్యానించారు.

తెలంగాణ పథకాలను కేంద్రం అనుసరిస్తోందని కేటీఆర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదని విమర్శలు చేస్తున్నారని, తమకు వచ్చింది గుండు సున్నానే కావొచ్చు... మరి కేంద్ర బడ్జెట్‌లో గుండు సున్నా వస్తే ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని అన్నారు. కేంద్రంతో గట్టిగా మాట్లాడేందుకు తాము కూడా మద్దతిస్తామని అన్నారు.

తెలంగాణలోని ప్రముఖ ఆలయాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. కుంభమేళాకు నిధులిచ్చిన కేంద్రం సమ్మక్క సారలమ్మ జాతరకు ఎందుకివ్వడం లేదని నిలదీశారు.
KTR
Revanth Reddy
Telangana
Central Government
Budget
Congress
BRS
Politics
Sammakka Saralamma

More Telugu News