Amit Shah: 'సహకార్ ట్యాక్సీ'... ఊబర్, ఓలా, ర్యాపిడోలకు దీటుగా కేంద్రం నూతన విధానం

Sahakar Taxi Indias New Taxi Service to Rival Ola Uber and Rapido
  • పార్లమెంటులో ప్రకటన చేసిన అమిత్ షా 
  • డ్రైవర్లకే లాభాలు, కార్పొరేట్ సంస్థలకు వాటా ఇవ్వాల్సిన పనిలేదని వెల్లడి
  • త్వరలోనే టూ వీలర్, ఆటో, ఫోర్-వీలర్ టాక్సీల నమోదు
  • రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా సహకార్ టాక్సీ సేవలు అందుబాటులోకి!
ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థలు ఓలా, ఊబర్, ర్యాపిడోలకు దీటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ట్యాక్సీ సేవల రంగంలోకి అడుగుపెడుతోంది. ప్రైవేటు సంస్థలకు పోటీగా కేంద్ర ప్రభుత్వం 'సహకార్ టాక్సీ' పేరుతో కొత్త ట్యాక్సీ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా బైక్, క్యాబ్ మరియు ఆటో సేవలను అందిస్తుంది.

పెద్ద కార్పొరేషన్లతో లాభాలను పంచుకోవాల్సిన అవసరం లేకుండా, డ్రైవర్లు నేరుగా సంపాదించే ప్రత్యామ్నాయ రవాణా సేవను అందించడమే ఈ చర్య యొక్క ముఖ్య ఉద్దేశం. దేశవ్యాప్తంగా టూ-వీలర్ ట్యాక్సీలు, ఆటో-రిక్షాలు, ఫోర్-వీలర్ ట్యాక్సీలను సహకార్ ట్యాక్సీ వ్యవస్థ కింద నమోదు చేసుకోవడం జరుగుతుందని కేంద్ర హోం మంత్రి, సహకార శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'సహకార్ సే సమృద్ధి' అనేది కేవలం నినాదం కాదని, దీనిని సాకారం చేయడానికి సహకార మంత్రిత్వ శాఖ గత మూడున్నర సంవత్సరాలుగా రాత్రింబవళ్లు పనిచేసిందని షా అన్నారు. రాబోయే నెలల్లో సహకార్ ట్యాక్సీ సేవను ప్రారంభించనున్నట్లు షా పేర్కొన్నారు. 

ప్రైవేట్ కంపెనీల మాదిరిగా కాకుండా, ప్రభుత్వం మద్దతుతో నడిచే సహకార్ ట్యాక్సీ సేవ ద్వారా వచ్చే ఆదాయం అంతా డ్రైవర్లకే చెందుతుందని, ఇది వారికి ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. సహకార్ సేవ ద్వారా వచ్చే లాభాలు ఏ పెద్ద పారిశ్రామికవేత్తకు వెళ్లవు, వాహనాల డ్రైవర్లకు మాత్రమే వెళతాయని అమిత్ షా స్పష్టం చేశారు.

అదనంగా, దేశంలోని సహకార వ్యవస్థలో బీమా సేవలు అందించేందుకు ఒక సహకార బీమా కంపెనీ కూడా ఏర్పాటు చేస్తామని షా చెప్పారు. తక్కువ సమయంలోనే ఇది ప్రైవేట్ రంగంలోనే అతిపెద్ద బీమా కంపెనీగా అవతరిస్తుందని అన్నారు. ఈ కొత్త కార్యక్రమం ప్రయాణికులకు నమ్మకమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన రవాణా ఎంపికను అందించడంతో పాటు డ్రైవర్లకు సాధికారత అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు అమిత్ షా వివరించారు.

ఇలాంటి సహకార ట్యాక్సీ విధానమే 'యాత్రి సాథీ' పేరుతో పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే నడుస్తోంది. ఇది మొదట్లో కోల్‌కతాలో మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం సిలిగురి, అసన్సోల్ మరియు దుర్గాపూర్ వంటి నగరాలకు విస్తరించింది. యాత్రి సాథి శీఘ్ర బుకింగ్‌లు, స్థానిక భాషల మద్దతు, సరసమైన ఛార్జీలు మరియు రౌండ్-ది-క్లాక్ కస్టమర్ సహాయాన్ని అందిస్తూ ప్రయాణికులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

2022లో, కేరళ ప్రభుత్వం సొంతంగా ఆన్‌లైన్ ట్యాక్సీ సేవ 'కేరళ సవారి'ని ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. తక్కువ వినియోగం కారణంగా ఇది మూతపడినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సవరించిన ఛార్జీలు మరియు మెరుగైన సాఫ్ట్‌వేర్‌తో తిరిగి ప్రారంభించాలని యోచిస్తోంది.
Amit Shah
Sahakar Taxi
Ola
Uber
Rapido
Government-backed taxi service
India
Cooperative taxi scheme
Affordable transportation
Driver empowerment

More Telugu News