Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించిన చంద్రబాబు

- పుష్కరాలకు ప్రత్యేక అధికారులుగా వీరపాండ్యన్, విజయరామరాజు నియామకం
- జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటన
- పుష్కర ఏర్పాట్లకు అధికారులు సన్నద్దం కావాలని సూచన
రాజమహేంద్రవరం కేంద్రంగా 2027లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కరాలకు సంబంధించి ఇప్పటి నుంచే తగిన ముందుస్తు ఏర్పాట్ల పర్యవేక్షణకు ఇద్దరు ఐఏఎస్ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు.
ఐఏఎస్ అధికారులు వీరపాండ్యన్‌ను ప్రత్యేక అధికారిగా, వి. విజయరామరాజును అదనపు ప్రత్యేక అధికారిగా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పనుల ప్రతిపాదనలు, కార్యాచరణ ప్రణాళిక, ఇతర అంశాల పర్యవేక్షణ వీరు చేపట్టనున్నారు.
నిన్న జరిగిన రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల కార్యాచరణ ప్రణాళికలపై ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు. పుష్కర ఏర్పాట్లకు అధికారులు సన్నద్ధం కావాలని తెలిపారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తి చేయాలని, సుందర ప్రదేశాలు, ఆలయాలు సందర్శించేలా పర్యాటకులను ఆకర్షించే ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.