ఖాతా తెరిచిన కోల్‌కతా.. రెండో మ్యాచ్‌లోనూ ఓడిన రాజస్థాన్

  • 8 వికెట్ల భారీ తేడాతో విజయం సాధించిన కోల్‌కతా
  • 97 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన క్వింటన్ డికాక్
  • నేడు హైదరాబాద్‌లో ఎస్ఆర్‌హెచ్, లక్నో జట్ల మధ్య మ్యాచ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా గత రాత్రి గువాహటిలో రాజస్థాన్ రాయల్స్‌(ఆర్ఆర్)తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) 8 వికెట్ల తేడాతో గెలిచి ఖాతా తెరిచింది. ఆర్ఆర్, కేకేఆర్ జట్లు రెండూ తమ తొలి మ్యాచుల్లో ఓడిపోవడంతో ఈ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగాయి.

హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చేజింగ్‌లో 243 పరుగులు చేసి ఔరా అనిపించిన ఆర్ఆర్.. ఈసారి మాత్రం 151 పరుగులకే పరిమితమైంది. ఇక, బెంగళూరుపై ఓటమిపాలైన కేకేఆర్ ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. 152 పరుగుల ఓ మాదిరి లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మొయీన్ అలీ (5), కెప్టెన్ అజింక్య రహానే (18) వికెట్లను కోల్పోయింది. వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ 61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంగ్‌క్రిష్ రఘువంశీ 22 పరుగులు (నాటౌట్) చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డికాక్‌కి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేసింది. వికెట్ కీపర్ ధృవ్ జురెల్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వి జైస్వాల్ 29, కెప్టెన్ రియాన్ పరాగ్ 25 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ పెద్దగా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, మొయీన్ అలీ, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టారు. ఐపీఎల్‌లో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య  హైదరాబాద్‌లో మ్యాచ్ జరగనుంది.


More Telugu News