Sanvit Mishra: జిమ్ కు వెళ్లకుండా 3 నెలల్లో 19 కిలోలు బరువు తగ్గాడు... ఎలా...?

19kg Weight Loss in 3 Months Without Gym Sanvit Mishras Success Story
  • సంవిత్ మిశ్రా అనే వ్యక్తి సక్సెస్ స్టోరీ
  • జిమ్, కఠినమైన డైట్ లకు దూరం
  • మెట్లు ఎక్కడం, సైక్లింగ్ చేయడం వంటి కసరత్తులతో ఫిట్ నెస్
  • సహజ సిద్ధ ఆహారంతో సక్సెస్ ఫుల్ గా బరువు తగ్గిన వైనం
అధిక బరువు లేదా ఊబకాయం అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అని నిపుణులు చెబుతుంటారు. అయితే ఒక్కసారి మితిమీరి బరువు పెరిగిన తర్వాత, ఆ పెరిగిన బరువును తగ్గించుకోవడం ఎంతో కష్టమైన పని. కొందరు గంటల కొద్దీ జిమ్ లలో గడుపుతుంటారు, మరికొందరు కఠిన ఉపవాసాలు ఉంటారు. కొందరు మాత్రలతో బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా ప్రయత్నించే క్రమంలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. 

అయితే సంవిత్ మిశ్రా అనే వ్యక్తి 3 నెలల్లో 19 కిలోల బరువు తగ్గడం ఓ సక్సెస్ స్టోరీగా చెప్పుకోవాలి. ఎందుకంటే అతడు జిమ్ కు వెళ్లకుండా, కఠినమైన డైట్ లు అనుసరించకుండా... కేవలం సహజసిద్ధ ఆహారం, కొద్దిపాటి కసరత్తులతోనే బరువు తగ్గడం విశేషం. సంవిత్ మిశ్రా తన జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా బరువు తగ్గడం సాధ్యమని నిరూపించారు. ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే సరైన జీవనశైలి చాలా అవసరమని ఆయన తెలిపారు. 

సంవిత్ మిశ్రా మాట్లాడుతూ "2025 ప్రారంభంలో నేను 98 కిలోలు ఉన్నాను. బరువు పెరగడం వల్ల చాలా నీరసంగా, అనారోగ్యంగా అనిపించింది. ఏదో ఒక మార్పు తప్పనిసరి అని నిర్ణయించుకున్నాను. కఠినమైన డైట్‌లు, వ్యాయామాల జోలికి పోకుండా, జీవనశైలిలో మార్పులు చేసుకున్నాను. ఆరోగ్యంగా బరువు తగ్గడమే నా లక్ష్యం.2025  మార్చి 24 నాటికి నేను 79 కిలోలకు చేరుకున్నాను. మూడు నెలల్లో 19 కిలోలు తగ్గాను!" అని వివరించారు.

ఆయన తన ఆహార ప్రణాళిక గురించి వివరిస్తూ, సంక్లిష్టమైన డైట్‌లకు బదులుగా, సహజసిద్ధమైన ఆహారానికి ప్రాధాన్యతనిచ్చానని అన్నారు.

ఉదయం: పండ్లు, శెనగ పిండితో చేసిన చీలా, అటుకులు
మధ్యాహ్నం: ఉడికించిన బ్రోకోలీ, కాకరకాయ, శెనగ పిండి చీలా
రాత్రి (త్వరగా): మఖానా (తామర గింజలు), వేరుశెనగ

బయటి ఆహారం, ప్యాక్ చేసిన ఆహారం, చల్లని పానీయాలు, పాలు పూర్తిగా మానేశానని ఆయన తెలిపారు. ఇంటిలో తయారుచేసిన భోజనం తీసుకోవడం వల్ల క్యాలరీలను నియంత్రించడంతో పాటు సరైన పోషకాహారం లభిస్తుందని వెల్లడించారు.

ఉద్యోగంతో పాటు ఫిట్‌నెస్ ఎలా కొనసాగించారని అడగగా, జిమ్‌కు వెళ్లకపోయినా ప్రతిరోజు చురుకుగా ఉండేలా చూసుకున్నానని చెప్పారు. అందుకోసం... ప్రతిరోజు 100 మెట్లు ఎక్కడం,  వారానికి మూడుసార్లు 30 నిమిషాలు సైకిల్ తొక్కడం వంటి కసరత్తులు చేశానని వివరించారు. బలం (మెట్లు ఎక్కడం), కార్డియో (సైకిల్ తొక్కడం) కలయికతో అలసిపోకుండానే కొవ్వును కరిగించవచ్చని అన్నారు. కొన్నిసార్లు బద్ధకంగా అనిపించినా, చిన్న ప్రయత్నాలు గొప్ప ఫలితాలను ఇస్తాయని గుర్తు చేసుకునేవాడినని తెలిపారు. మెట్లు ఎక్కడం అలవాటుగా మారిందని, సైకిల్ తొక్కడం వ్యాయామంలా కాకుండా ఆహ్లాదంగా అనిపించేదని వివరించారు.

ఆహారం తినాలనే కోరికలను ఎలా నియంత్రించారని అడుగ్గా... ప్రారంభంలో ఫాస్ట్ ఫుడ్ మరియు స్వీట్లు తినాలని అనిపించేదని, వాటికి బదులుగా వేయించిన మఖానా మరియు పండ్లు వంటి ఆరోగ్యకరమైన వాటిని తీసుకునేవాడినని తెలిపారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లినప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకునేవాడినని, ఎంత ఆహారం తీసుకుంటున్నామన్న దానిపై నియంత్రణ ఉండేదని అన్నారు.

"బరువు తగ్గడం అంటే కఠినమైన డైటింగ్ లేదా వ్యాయామాలు చేయడం కాదు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, చిన్న, స్థిరమైన అలవాట్లతో ప్రారంభించండి. ఖరీదైన డైట్‌లు లేదా జిమ్ లో సభ్యత్వాలు అవసరం లేదు, కేవలం పట్టుదల, క్రమశిక్షణ ఉంటే చాలు. నేను చేయగలిగినప్పుడు, ఎవరైనా చేయగలరు!" అని 37 ఏళ్ల సంవిత్ మిశ్రా అన్నారు.
Sanvit Mishra
weight loss
weight loss journey
natural diet
healthy lifestyle
fitness
exercise
no gym
weight loss tips
healthy eating

More Telugu News