PM Kisan Samman: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనర్హుల నుంచి రూ. 416 కోట్లు రికవరీ

PM Kisan Samman Fund recoverey details
  • అనర్హుల ఏరివేతకు సంబంధించి చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం
  • ఆధార్, ఆదాయపుపన్ను, ఆర్థిక మంత్రిత్వ శాఖల సమాచారంతో అనర్హుల ఏరివేత కార్యక్రమం
  • ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల నుంచి రికవరీ
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనర్హుల నుంచి రూ. 416 కోట్లు రికవరీ చేసినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఈ పథకంలో అనర్హుల ఏరివేతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6 వేలను మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. 2019లో ఈ పథకం ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 19 విడతల్లో రూ. 3.68 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ప్రారంభంలో స్వీయ ధృవీకరణ ఆధారంగా లబ్ధిదారుల పేర్ల నమోదుకు అనుమతించారు. ఇప్పటికే 100 శాతం ఆధార్ సీడింగ్ పూర్తి చేయగా, ఆధార్, ఆదాయపన్ను శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖల వద్ద ఉన్న సమాచారంతో అనర్హులను ఏరివేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, చట్టబద్ధ పదవుల్లో ఉన్నవారు ఈ పథకం కింద లబ్ధిపొందితే వారి నుంచి రికవరీ చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. 

ఈ పథకం ద్వారా లబ్ధి పొందే రైతుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, పీఎం కిసాన్ ఆన్‌లైన్ పోర్టల్‌లో స్వయంగా రిజిస్టర్ చేసుకోవచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు.
PM Kisan Samman
Fund Recovery
India

More Telugu News