Loknath Singh: బెంగళూరు రియల్టర్ ను చంపిన భార్య, అత్త... కారణం ఇదే!

Bangalore Realtor Murdered by Wife and Mother in law

  • బెంగళూరులో హత్యకు గురైన రియల్టర్ లోక్ నాథ్ సింగ్
  • వేధింపులు భరించలేక హత్య చేసినట్టు భార్య, అత్త వెల్లడి 
  • ఆహారంలో మత్తు మందు కలిపిన భార్య... మెడపై రెండు పోట్లు పొడిచిన అత్త

బెంగళూరు శివారు ప్రాంతంలో రియల్టర్ దారుణ హత్యకు గురైన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రియల్టర్ లోక్‌నాథ్ సింగ్ హత్య కేసులో అతని భార్య యశస్విని సింగ్, అత్త హేమ బాయిలను సోలదేవనహಳ್ಳಿ పోలీసులు అరెస్ట్ చేశారు. లోక్‌నాథ్ వేధింపులు తాళలేకనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. 

పోలీసుల కథనం ప్రకారం, రామనగర జిల్లాకు చెందిన లోక్‌నాథ్ సింగ్‌కు మోసాలకు పాల్పడిన చరిత్ర ఉంది. అతడు నాలుగు నెలల క్రితం యశస్విని (19) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన కొద్ది రోజులకే లోక్‌నాథ్ అసలు స్వరూపం బయటపడింది. ఎప్పుడైనా తన కోరిక తీర్చేందుకు ఆమె నిరాకరిస్తే చిత్రహింసలకు గురిచేసేవాడు.

అంతేకాదు, అత్త హేమ బాయి (37)తో  అక్రమ సంబంధం పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. నాతో శారీరక సంబంధం పెట్టుకునేలా నీ తల్లిని ఒప్పించు అంటూ యశస్వినిపై లోక్‌నాథ్ ఒత్తిడి చేశాడు. దీంతో విసిగిపోయిన యశస్విని అతడిని విడిచి పుట్టింటికి వచ్చేసింది. అయినప్పటికీ, అతడి వేధింపులు ఆగలేదు. అత్తగారింటికి కూడా వచ్చి నానా రభస సృష్టించేవాడు. తన భార్య యశస్వినిని తనతో పంపించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమె తండ్రి కృష్ణ సింగ్‌ను బెదిరించాడు. దీంతో విసిగిపోయిన యశస్విని, ఆమె తల్లి హేమ బాయి లోక్‌నాథ్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. 

పథకం ప్రకారం, లోక్‌నాథ్‌ను హత్య చేయడానికి అవకాశం కోసం ఎదురుచూశారు. ఈ క్రమంలో శనివారం ఉదయం లోక్‌నాథ్... యశస్వినికి ఫోన్ చేసి ఆమెను కలుస్తానని చెప్పాడు. తన సోదరికి తాను బెంగళూరు వెళుతున్నానని చెప్పి ఉదయం 10 గంటలకు తన కారులో బయలుదేరాడు. యశస్విని, హేమ బాయి కలిసి భోజనం తయారు చేసి అందులో నిద్రమాత్రలు కలిపారు. లోక్‌నాథ్ కూడా పార్టీ చేసుకుందామని కొన్ని బీరు బాటిళ్లను తీసుకుని వచ్చాడు. 

అనంతరం యశస్వినితో కలిసి కారులో బీజీఎస్ లేఅవుట్‌లోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. కారులో బీరు తాగుతుండగా, యశస్విని నిద్రమాత్రలు కలిపిన భోజనం లోక్‌నాథ్‌కు తినిపించింది. అదే సమయంలో తన తల్లికి ఫోన్ ద్వారా లొకేషన్ షేర్ చేసింది. దాంతో హేమ బాయి కూడా ఆ ప్రదేశానికి చేరుకుంది. 

లోక్‌నాథ్‌కు మత్తు ఎక్కువ కావడంతో హేమ బాయి కత్తితో అతని మెడపై రెండుసార్లు పొడిచింది. తీవ్రంగా గాయపడిన లోక్‌నాథ్ కారు దిగి దాదాపు 150 మీటర్ల దూరం పరిగెత్తి ఆటోలో దాక్కునే ప్రయత్నం చేశాడు. అతని అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేలోపే లోక్‌నాథ్ మృతి చెందాడు. 

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా, ఈ హత్య చేసింది తల్లీకూతుళ్లు అని వెల్లడైంది.

Loknath Singh
Yashaswini Singh
Hema Bai
Bangalore Murder
Real Estate
Wife
Mother-in-law
Domestic Violence
India Crime News
Bengaluru Real Estate
  • Loading...

More Telugu News