Indian Americans: గ్రీన్ కార్డ్ హోల్డర్లు, హెచ్–1 బీ వీసాదారులకు కొత్త చిక్కులు

New Hurdles for Green Card Holders and H1B Visa Holders in the US
  • అమెరికా నుంచి విదేశాలకు వెళుతుంటే గంటల తరబడి తనిఖీలు
  • విదేశాల్లో నెలల తరబడి ఉండి తిరిగి వచ్చిన వారిపై అధికారుల ప్రశ్నల వర్షం
  • చట్టాలు కఠినతరం చేయడంతో మరింత జాగ్రత్తగా పరీక్షలు జరుపుతున్న ఇమిగ్రేషన్ సిబ్బంది
అమెరికాలో స్థిరపడిన భారతీయులు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. గ్రీన్ కార్డ్ ఉన్నప్పటికీ విమానాశ్రయాల్లో అదనపు తనిఖీలు తప్పడం లేదని, సెక్యూరిటీ చెకప్ పేరుతో గంటల తరబడి అధికారులు ప్రశ్నిస్తున్నారని వాపోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఇమిగ్రేషన్ చట్టాలను మరింత కఠినం చేశారని చెబుతున్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి వెనక్కి పంపించే క్రమంలో ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. గ్రీన్ కార్డ్ పొందినంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చని అనుకోవడం పొరపాటేనని, అమెరికాలో ఎవరు ఉండాలనేది నిర్ణయించేది తామేనని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటనతో అమెరికాలో ఉంటున్న భారత సంతతి ప్రజల్లో గుబులు రేగుతోంది.

అందుకు తగ్గట్లే విదేశాలకు ప్రయాణం పెట్టుకుంటే ఇమిగ్రేషన్ అధికారులు గంటల తరబడి తనిఖీలు చేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా విదేశాల్లో ఆరు నెలలకు పైగా ఉండి తిరిగి అమెరికాలో అడుగుపెట్టిన వారిని మరింత ఎక్కువ సమయం ప్రశ్నిస్తున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న భారత సంతతి గ్రీన్ కార్డ్ హోల్డర్లు, హెచ్ 1 బీ వీసాదారులు, ఎఫ్ 1 వీసాపై వెళ్లిన విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఇమిగ్రేషన్ వ్యవహారాలు చూసే న్యాయవాదులు సూచిస్తున్నారు.

అమెరికాలో నివసించేందుకు ప్రభుత్వం జారీచేసిన అధికారిక గుర్తింపు పత్రాలను వెంట తీసుకెళ్లాలని, గ్రీన్ కార్డ్ గడువు ముగిసేంత వరకూ చూడకుండా ముందుగానే రెన్యువల్ చేయించుకోవాలని చెప్పారు. భారతదేశం జారీచేసిన పాస్ పోర్ట్, హెచ్ 1 బీ వీసాదారులైతే తాజా పే స్లిప్, విద్యార్థులైతే తమ కోర్సు కొనసాగే కాలానికి సంబంధించి కాలేజ్ లేదా యూనివర్సిటీ జారీ చేసిన అధికారిక ధ్రువపత్రం వెంట ఉంచుకోవాలని తెలిపారు. అదేసమయంలో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు కూడా భారత సంతతి అమెరికన్లకు, హెచ్ 1 బీ, ఎఫ్ 1 వీసాదారులకు అడ్వైజరీ జారీ చేశారు. చట్టాల్లో మార్పుల కారణంగా అదనపు తనిఖీలు తప్పవని, గంటల తరబడి తనిఖీలు కొనసాగినా ఓర్పు వహించాలని సూచించారు.
Indian Americans
Green Card Holders
H-1B Visa
F-1 Visa
US Immigration
India
Travel Restrictions
Immigration Lawyers
JD Vance
US Homeland Security

More Telugu News