Pawan Kalyan: చంద్రబాబే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

Pawan Kalyan Calls Chandrababu Naidu His Inspiration

  • చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమన్న పవన్
  • ఆయన 15 ఏళ్లు సీఎంగా ఉండాలన్న డిప్యూటీ సీఎం
  • రాయలసీమ రతనాలసీమ కావాలని ఆకాంక్ష

ఏపీ కష్టాల్లో ఉన్న సమయంలో కూటమిని రాష్ట్ర ప్రజలు గెలిపించారని... మొత్తం 175 సీట్లలో 164 సీట్లను కట్టబెట్టి ఘన విజయం అందించారని చెప్పారు. కూటమికి 21 ఎంపీ స్థానాలను కట్టబెట్టారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళుతున్నామని చెప్పారు. రాష్ట్రం బాగుండాలని చంద్రబాబు కోరుకుంటారని... చంద్రబాబే తనకు స్ఫూర్తి అని... ఆయన స్ఫూర్తితోనే తాను పని చేస్తున్నానని తెలిపారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని... ఆయన 15 ఏళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో రైతు రాజన్న పొలంలో ఫామ్ పాండ్ నిర్మాణ పనులకు పవన్ భూమిపూజ చేశారు. అనంతరం పూడిచెర్లలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలో పల్లె పండుగ విజయవంతం కావడానికి చంద్రబాబే కారణమని పవన్ కితాబునిచ్చారు. రాయలసీమలో నీటి కష్టాలు ఎక్కువగా ఉండేవని చెప్పారు. భారీ వర్షాలు పడితే నీటి నిల్వ సౌకర్యం రాయలసీమలో లేదని అన్నారు. మే నెలలోపు లక్ష 55 వేల నీటి కుంటలు పూర్తి కావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని... వర్షాల సమయంలో ఈ కుంటలన్నీ నిండితే ఒక టీఎంసీ నీళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలు చెప్పినట్టు రాయలసీమ రతనాలసీమ కావాలని ఆకాంక్షించారు. 

రాష్ట్రం బాగుండాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని... ఆయనను ప్రేరణగా తీసుకుని తనకు అప్పగించిన శాఖలన్నింటినీ బలోపేతం చేస్తున్నానని చెప్పారు. ఒకేరోజు 13,326 గ్రామసభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించి ప్రపంచ రికార్డు సాధించామని అన్నారు. రాష్ట్రంలో 52.92 లక్షల కుటుంబాల్లో 97.44 లక్షల మంది ఉపాధి కూలీలకు స్వగ్రామాల్లో ఉపాధి కల్పించామని తెలిపారు. 

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో 4 వేల పైచిలుకు రోడ్లు మాత్రమే నిర్మించారని... ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లోనే దాదాపు 4 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగిందని పవన్ వెల్లడించారు. 100 మందికి పైగా జనాభా ఉన్న గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పించామని చెప్పారు. గిరిజన గ్రామాల్లో విద్యుత్, తాగునీటితో పాటు మౌలిక వసతులు కల్పించామని తెలిపారు.

Pawan Kalyan
Chandrababu Naidu
Andhra Pradesh
AP Politics
Development
Irrigation
Rayalaseema
Rural Development
Employment
Infrastructure
  • Loading...

More Telugu News