Chiranjeevi: మీకు తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాను.. చిరుపై ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర పోస్ట్‌!

Pawan Kalyans Heartfelt Post on Chiranjeevis UK Parliament Award
  • చిరుకు జీవిత సాఫల్య పుర‌స్కారంతో ఘ‌న స‌త్కారం
  • అన్న‌య్య‌కు ఈ అవార్డు రావ‌డంపై సోద‌రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ హ‌ర్షం
  • ఈ పుర‌స్కారం చిరంజీవి కీర్తిని మరింత పెంచిందంటూ 'ఎక్స్' వేదిక‌గా పోస్ట్
మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్ల‌మెంటులో బ్రిడ్జ్ ఇండియా సంస్థ జీవిత సాఫల్య పుర‌స్కారంతో ఘ‌నంగా స‌త్క‌రించిన విష‌యం తెలిసిందే. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి ఆయ‌న చేసిన‌ సేవ‌ల‌కుగానూ ఈ అరుదైన పుర‌స్కారం ద‌క్కింది. అయితే, చిరుకు ఈ అవార్డు రావ‌డంపై సోద‌రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఆయ‌న‌కు త‌మ్ముడిగా పుట్టినందుకు గ‌ర్వంగా ఉంద‌న్నారు. ఈ పుర‌స్కారం అన్నయ్య చిరంజీవి కీర్తిని మరింత పెంచిందంటూ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప‌వ‌న్ ఓ పోస్ట్ పెట్టారు.  

"సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి... స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో చిత్ర రంగంలో మెగాస్టార్ గా ఎదిగారు. నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్నారు. నటనకు పర్యాయపదంగా నిలిచారు. తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకున్నారు. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాను. 

నేను ఆయ‌న‌ను ఒక అన్నయ్యగా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను. నేను జీవితంలో ఏం చేయాలో తెలియక, అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి  మా అన్న‌య్య‌. నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి. తన సేవా భావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్నవారికి రక్తదానం, నేత్రదానం అందిస్తున్నారు. నన్నే కాకుండా కోట్లాదిమంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య.  

తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా ఎంతోమంది ఎదుగుదలకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తున్నారు. టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచారు అన్న‌య్య చిరంజీవి. ఆయన సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పురస్కారాన్ని గౌ|| రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్మూ చేతుల మీదుగా అందుకున్నారు. 

పద్మవిభూషణ్ డా. మెగాస్టార్ చిరంజీవి గారికి, ఈనెల 19న జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకుని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పురస్కార కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న స్టాక్ పోర్ట్ ఎంపీ శ్రీ నవేందు మిశ్రా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను." అని ప‌వ‌న్ త‌న పోస్టులో రాసుకొచ్చారు.  
Chiranjeevi
Pawan Kalyan
MegaStar
UK Parliament
Lifetime Achievement Award
Bridge India
Brotherly Love
Awards and Recognition
Indian Cinema
Padma Vibhushan

More Telugu News