Vamsikrishna Jogada: ‘మ్యాట్రిమోనీ’ మోసగాడు.. పెళ్లి పేరుతో మహిళలకు వల.. ఆపై డబ్బులు దండుకుని పరార్!

Hyderabad Police Arrest Matrimony Fraudster Vamsikrishna Jogada
  • రెండో పెళ్లి కోసం వెతుకున్న మహిళలను మోసం చేస్తున్న ప్రబుద్ధుడు
  • మ్యాట్రిమోనీ సైట్‌లలో తప్పుడు సమాచారంతో యువతులకు వల
  • జూబ్లీహిల్స్ మహిళా వైద్యురాలి ఫిర్యాదుతో నిందితుడు అరెస్టు
నేను ఎన్నారై, అమెరికాలో అమ్మ పెద్ద డాక్టర్.. ఆమె ఇండియాకు రాగానే పెళ్లి చేసుకుందాం అంటూ మ్యాట్రిమోనీ తరహా వెబ్‌సైట్లలో తప్పుడు సమాచారంతో అమ్మాయిలను మోసం చేసి వారి నుంచి డబ్బులు దండుకునే వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్‌ హర్ష చెరుకూరి బీటెక్ చదవడానికి 2014లో హైదరాబాద్‌కు చేరుకున్నాడు. బీటెక్ మధ్యలోనే ఆపేసి 2015లో ఆన్‌లైన్‌ గేమింగ్, బెట్టింగ్‌ వంటి జూదాలకు అలవాటుపడ్డాడు. అంతే కాకుండా జాబ్ కన్సల్టెన్సీ పేరుతో కొంత మందిని మోసం చేసిన కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చాడు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.

ఆ తరువాత సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి తన ఆదాయంలో ఎక్కువగా సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేశాడు. అలా దాదాపు వెయ్యి మంది నుంచి డబ్బు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా యానాంకు చెందిన ఓ ఎమ్మెల్యే ఫొటోను తన సోషల్ మీడియాలో డీపీగా పెట్టుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 50 మంది నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేశాడు. ఈ కేసుల్లో పలు మార్లు అరెస్టు అయి జైలుకు వెళ్లివచ్చినా ఇతనిలో ఎటువంటి మార్పు రాలేదు.

ఆ తర్వాత మోసాలకు పెళ్లి సంబంధాలను ఎంచుకున్నాడు. మ్యాట్రిమోనీ తరహా వెబ్‌సైట్‌లలో తప్పుడు సమాచారం పెట్టి.. రెండో పెళ్లి కోసం చూస్తున్న వారు, 30 ఏళ్ల వయసు దాటిన వారినే టార్గెట్‌ చేశాడు. వాట్సప్‌ కాల్‌ ద్వారా చాటింగ్, కాల్స్ ద్వారా మంతనాలు చేస్తూ తనమీద అమ్మాయిలకు నమ్మకం కలిగిన తర్వాత తన బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌ అయ్యాయని.. ఐటీ అధికారులు డబ్బు తీసుకెళ్లారని, కుటుంబ సభ్యులు ఆసుపత్రుల్లో ఉన్నారంటూ కట్టు కథలు చెప్పేవాడు. అలా ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల నుంచి 25 లక్షల వరకూ మోసం చేసేవాడు.

కొన్నిరోజులకు బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే వారి ఫొటోలు మార్ఫింగ్‌ చేసి వైరల్‌ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. దీంతో కొందరు తమ పరువు పోతుందని భయంతో మిన్నకుండిపోగా, ఇటీవల అతని వల్ల రూ. 11 లక్షలు మోసపోయిన జూబ్లీహిల్స్‌కు చెందిన ఒక డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని బెంగుళూరులో అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్‌కు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాలతో జైలుకు తరలించారు. 
Vamsikrishna Jogada
Harsh Cherukuri
Online Matrimony Fraud
Hyderabad Police
Cybercrime
Financial Fraud
Dating Scam
Job Scam
Telangana Police
Fake Profile

More Telugu News